Wednesday, January 22, 2025

వరుసగా ఏడో బడ్జెట్ ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశిష్టత
83 నిమిషాలు సాగిన బడ్జెట్ ప్రసంగం
అధికార పక్షం నుంచి అభినందనలు
ప్రతిపక్షం నుంచి హేళనలు
న్యూఢిల్లీ: ఆధునికతతో సంప్రదాయం మిళితం చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం టాబ్లెట్ పిసి నుంచి పఠిస్తూ వరుసగా తన ఏడవ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. టాబ్లెట్ పిపి ఎర్ర రంగులోని ‘బహి ఖాతా’ స్టైల్ బ్యాగ్‌లో ఉన్నది.
ఊదా పసిడి రంగు అంచుతో తెల్ల రంగు మైసూర్ పట్టు చీర ధరించిన నిర్మలా సీతారామన్ 83 నిమిషాల సేపు సాగించిన బడ్జెట్ ప్రసంగంలో ఉపాధి కల్పనకు ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు తరచుగా అభినందనలు తెలియజేయగా ప్రతిపక్ష సభ్యులు మధ్య మధ్యలో హేళనలు చేశారు. రెండవ బ్లాక్‌లోని మొదటి వరుస బెంచ్‌లో నుంచి సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదించారు. బిజెపి అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఆమె పక్కనే ఆశీనుడయ్యారు. 83 నిమిషాల ప్రసంగం సమయంలో కనీసం 71 సందర్భాల్లో అధికార పక్ష సభ్యులు తమ బల్లలు చరుస్తూ బడ్జెట్ ప్రకటనలను స్వాగతించారు. బీహార్, ఆంధ్ర ప్రదేశ్‌లకు సీతారామన్ పూర్తి స్థాయి ప్రకటనలు చేసినప్పుడు ప్రతిపక్షాల నుంచి అత్యంత తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి.

బీహార్‌లో జెడి (యు), ఆంధ్ర ప్రదేశ్‌లో టిడిపి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు కీలకమైన మిత్ర పక్షాలు అన్నది విదితమే, బీహార్, ఆంధ్ర ప్రదేశ్ కోసం ఆర్థిక శాఖ మంత్రి కొన్ని పథకాలు చదివినప్పుడు ప్రతిపక్ష సభ్యులు ‘సర్కార్ కో బచానే వాలా బడ్జెట్’, ‘సర్కార్ బచావో’, ‘కుర్సీ బచావో’ నినాదాలు చేశారు. భారీ వర్షపాతం వల్ల దెబ్బ తిన్న రెండు దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కాంగ్రెస్, డిఎంకె సభ్యులు డిమాండ్లు చేయడం కనిపించింది. వర్ష బాధిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కోసం సీతారామన్ కొన్ని ప్రకటనలు చేసినప్పుడు వారిలో ఆగ్రహం కానవచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్న మహారాష్ట్ర, హర్యానా కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక ప్రకటనలు ఏవీ లేకపోవడం గమనార్హం. రైల్వేల గురించి గాని, ఎన్నికల సమయలో రాజకీయ కాక రేపిన అగ్నీపథ్ పథకం గురించి గానీ బడ్జెట్‌లో ప్రకటనలు ఏవీ లేవు.

తృణమూల్ సభ్యుడు సౌగతా రాయ్, డిఎంకె సభ్యుడు దయానిధి మారన్ తరచు వ్యాఖ్యలు చేస్తుండడంతో లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిద్దరినీ ఆయన హెచ్చరించారు. ఉదయం 11 గంటల లోపు ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ చాంబర్‌లోకి ప్రవేశించగా బిజెపి సభ్యులు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా ప్రతిపక్ష సభ్యులు ‘జై సంవిధాన్’ అని నినదించారు. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ సీతారామన్ తన ప్రసంగం ప్రారంభించగా ‘400 పార్’ నినాదాలతో ప్రతిపక్ష సభ్యులు మోడీ ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన అనంతరం సీతారామన్‌ను అభినందించేందుకు ప్రధాని మోడీ ఆమె సీటు వరకు నడిచి వెళ్లారు.

ఆంధ్ర ప్రదేశ్, బీహార్ కోసం ప్రత్యేక ప్రకటనలు చేసినందుకు సీతారామన్‌కు కేంద్ర మంత్రులు కింజరాపు రామమోహన్ నాయుడు (టిడిపి), చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జెపి ఆర్‌వి) కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, బీహార్ కోసం బడ్జెట్‌లో చేసిన ప్రకటనలకు ఆనందం వెలిబుచ్చుతూ వారిద్దరు పరస్పరం ఆలింగనం చేసుకోవడం కానవచ్చింది. దేశంలో దేశీయ క్రూజ్ సర్వీసులు నిర్వహిస్తున్న విదేశీ నౌకాయాన సంస్థల కోసం సరళమైన పన్ను వ్యవస్థను సీతారామన్ ప్రకటించగా ‘ఈ ప్రకటనలు భారీ వ్యక్తుల కోసమే’ అని తృణమూల్ సభ్యుడు సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. సీతారామన్ బడ్జెట్ సమర్పణను వీక్షించేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభలోని వీక్షకుల గ్యాలరీల్లో సమీకృతమయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి కుమార్తె వాజ్ఞయి పరకాల, విద్యా లక్ష్మీనారాయణన్ సహా బంధువులు కూడా బడ్జెట్ వింటూ వీక్షకుల గ్యాలరీలో కనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News