వ్యయసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలి
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని సూచించారు. ఆదివారం ఇక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ అన్ని రాష్ట్రాలు పంటల వైవిధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. సాగు రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణను శక్తిగా మలుచుకోవాలని సూచించారు. వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని మోడీ ఆకాంక్షించారు. 2023లో భారత్ జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. దీనిద్వారా వీలయినంత ఎక్కువ లబ్ధి పొందడం కోసం ప్రతి రాష్ట్రం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రతి రాష్ట్రం కూడా తన శక్తి మేరకు తనవంతు పాత్రను నిర్వహించాయని మోడీ ప్రశంసించారు.‘
కొవిడ్ మహమ్మారిపై భారత్ పోరాటంలో ప్రతి రాష్ట్రం కూడా తమ శక్తి మేరకు తమ వంతు పాత్ర పోషించాయి. దీనివల్లనే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రోల్‌మోడల్‌గా నిలవగలిగింది’ అని ఆయన అన్నారు. ‘భారత దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో మొట్టమొదటిసారి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులు ఒక చోట చేరి మూడు రోజుల పాటు దేశానికి ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఈ ఉమ్మడి ప్రక్రియ ఈ సమావేశంలో అజెండాను అభివృద్ధి చేయడానికి తోడ్పడింది’ అని ఆయన అన్నారు. 2020లో కొవిడ్ మహమ్మారి తర్వాత తొలి సారిగా ప్రత్యక్షంగా జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కనీసం 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టెనెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు.