Monday, December 23, 2024

విద్యా, ఆరోగ్యంపై దృష్టి సారిస్తాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
ఘనంగా ఉస్మానియా యూనివర్శిటీ ఫౌండేషన్ డే

Focus on education and health

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : నీళ్లు, నిధులు,నియామకాలు నినాదంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ రంగాల్లో అపూర్వ విజయాన్ని సాధించామని, ఇక మిగతా విషయాలపై దృష్టిని సారిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఓయూ ఫౌండేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులను పెంపొందించామన్నారు. నీటి లభ్యతతో వివిధ రకాల పంటలు, ముఖ్యంగా వరి సాగు అంచనాలకు మించి చేతికి వచ్చిందన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో దాదాపు 45 వేల చెరువులను పునరుద్ధరించడం జరిగిందని, దీంతో భూగర్భ జలాలు పెరిగాయని, ప్రస్తుతం భూ గర్భంలో సుమారు 500 టిఎంసిల మేరకు నీటి వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వినోద్‌కుమార్ తెలిపారు.ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా నోటిికేషన్లు విడుదల అవుతాయని అన్నారు. యూనివర్సిటీలలో ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఖాళీలు లేకుండా చూడాలని ఆయన వైస్ ఛాన్సలర్ ప్రొ. రవీందర్‌కు సూచించారు.

రానున్న రోజుల్లో విద్యా, ఆరోగ్యం పై దృష్టిని సారిస్తున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ పాల్ కార్యదర్శి భరత్‌లాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. తాను దేశ జల వనరుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో విశ్లేషిస్తే తెలంగాణలో నీటి పారుదల రంగంలో గణనీయంగా ప్రగతిని సాధించిందని అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, డీన్ మల్లేశం, రెడ్యా నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News