Wednesday, January 22, 2025

హరితహారంపై దృష్టి కేంద్రీకరించాలి: ప్రియాంక వర్గీస్

- Advertisement -
- Advertisement -

సమీక్ష సమావేశంలో సిఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్

Focus on greenery

మనతెలంగాణ/ హైదరాబాద్ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సిఎం ఓఎస్‌డి ప్రియాంకవర్గీస్ అన్నారు. గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, మెదక్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ,జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలతో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంకవర్గీస్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

అన్ని ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా మొక్కలు నాటాలని ఈ విషయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రియాంకవర్గీస్ కోరారు. మొక్కలకు సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న గోడలపై, పాఠశాల ప్రహరీలలో మంచి బొమ్మలను వేయించాలని… అవి అందరినీ ఆకట్టుకునేలా, ఆలోచింపచేసి ఆనందం కలిగించేలా ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఎకరం విస్తీర్ణంలో శాండల్ వుడ్ పార్కును తయారు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్‌కు సూచించారు.

హరితహారం పనుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేదిలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ జిల్లాను హరితహారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కండ్లకోయలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు ఎంతో బాగుందన్నారు. ఇదే తరహాలో మరిన్ని పార్కులు అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. 2022 జూన్‌లో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సిబ్బంది అందరూ సన్నద్దంగా ఉన్నారని అన్నారు.

భావితరాలకు మంచి వాతావరణాన్ని, ఎలాంటి కాలుష్యం, కలుషితం లేని వాతావరణం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ హరీశ్ వివరించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు సైతం నిర్వహించి మొక్కలు పెంచేందుకు గ్రామాలు,మున్సిపాలిటీలను దత్తత తీసుకోవాలని తెలియజేశామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా… తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News