Saturday, January 4, 2025

అందరికీ ఆహారం ఒక బృహత్తర లక్ష్యం

- Advertisement -
- Advertisement -

జీవులకు గాలి నీరు తరువాత ఆహారం మూడవ ప్రాధమిక అవసరం . ఆహారం లేకుంటే జీవమే లేదు . అందుకే ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నంపెట్టు అ తర్వాతే వేదం చెప్పు అని ఆహారం ప్రాముఖ్యత గురించి ప్రముఖ భారతీయ తత్వవేత్త స్వామివివేకానంద సెలవిచ్చారు. నేడు ఆహారలేమి, ఆకలి విపత్తు, పోషకాహారలోపం అనేవి ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆహార సమస్యలు. ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్లమంది ప్రజలు ఆకలితో బాధ పడుతున్నారని, 190 కోట్ల మందికి సురక్షితమైన పోషకాహారం అందుబాటులో లేదని , ఐదు ఏండ్ల లోపు పిల్లల మరణాలలో 45 శాతం పిల్లలు పోషకాహరలోపంతో మరణిస్తున్నారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.

మనదేశంలో కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా 10కోట్ల మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందులో 70 వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది. రాబోయే రోజు ల్లో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచసుస్థిరాభివృద్దిలక్ష్యాలలోఆహారం రెండవది. అందరికిఆహారం (ఫుడ్ ఫర్ ఆల్ )అందించాలనే కృషిలో భాగంగా ఐక్యరాజ్యసమితి ఆహర- వ్యవసాయసంస్థ వ్యవస్థాపక దినం 1945 అక్టోబర్16న ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపాలని యూఎన్‌ఓ సభ్యదేశాలు నిర్ణయించాయి. తొలిసారి 1981 సంవత్సరంలో ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాము. ‘2023లో నీరే జీవం నీరే ఆహారం : ఎవ్వరిని వదిలిపెట్టొద్దు’ అనే ఇతివృత్తంతో జరుపుకున్నాము.

ఆందోళనకరంగా ఆహారసమస్య : సోమాలియా, ఇథియోపియా నైజీరియా, దక్షిణ సుడాన్ , యెమెన్ లాంటి దేశాలలో సుమారు 10 లక్షల ప్రజలు విపత్తు స్థాయి ఆకలిని ఎదుర్కొంటున్నారని హంగర్ హాట్ స్పాట్ రిపోర్ట్ -2022 పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ జనాభా సుమారు 1000 కోట్లకు పెరుగనున్నదని శాస్త్రజ్ఞుల అంచనా. కనుక పెరుగుచున్న జనాభాకు సరిపడా ఆహారదినుసులు అందించలేక ప్రపంచం అతిసమీపకాలంలో తీవ్రమైన ఆహారసంక్షోభాన్ని చవిచూడనున్నది . దీని ఫలితంగా ఏర్పడే ఆకలి సంక్షోభ పరిస్థితికి సంఘర్షణలు వాతావరణ మార్పు కోవిడ్-19 , కొనుగోలు శక్తి తగ్గడం అను నాలుగు అంశాలు ప్రధానకారణాలుగా ఉంటాయని వరల్ ఫుడ్ ప్రోగ్రామ్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రకృతి వనరులను వాడుకొంటున్న తీరును ఆహార పద్దతులను తక్షణం మార్చుకోవాలని లేదంటే మరో 25 ఏండ్లలో ఆహార సంక్షోభంతో ఆకలి విపత్తు తప్పదని డెన్మార్క్ కు చెందిన ద వరల్డ్ కౌంట్స్ సంస్థ తన రిపోర్ట్‌లో తెలిపింది. పెరుగుతున్న జనాభా రోజుకు రెండు పూటల కడుపు నిండా తినాలంటే గతంతో పోలిస్తే 70% ఎక్కువ పంటలు పండించాల్సి ఉంటుందని ప్రముఖ అమెరికన్ సోషియో బయాలజిస్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయపడ్డాడు.

మన దేశం మొత్తం జనాభా 142 కోట్లలో సుమారు 19 కోట్లమంది ఆకలిని ఎదుర్కొంటున్నారని 43 శాతం పిల్ల లు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 13 కోట్ల మంది పేదరికం నుం డి తప్పించుకున్నారని, అయితే అందులో సుమారు 9 కోట్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం కోసం కష్టపడుతున్నారని భారత థింక్ ట్యాంక్ నీతిఅయోగ్ తెలిపింది. వేల్తుంగర్ హిల్ఫ్ ( జర్మని ) మరియు కన్సర్న్ వరల్ వైడ్ ( ఇర్లాండ్ ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన 18 వ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ -2023 ప్రకారం ఆకలి కేటగిరిలో 125 దేశాలలో భారత్ 111వ స్థానానికి పరిమితమైంది .

అయితే ఈ నివేదిక మనదేశ వాస్తవ ఆకలి పరిస్థితులకు విభిన్నంగా ఉన్న తప్పుడు కొలతగా కేంద్రప్రభుత్వం పేర్కొంది. అదే 19వ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ -2024 రిపోర్ట్ ప్రకారం 127 దేశాలలో మనదేశం 105వ స్థానంలో ఉంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం మనదేశం ఆకలినివారణ చర్యలలో చాల ముందున్నదని చెప్పవచ్చును. మనదేశంలో గత కొన్నేళ్లుగా ఋతుపవనాలు సహకరించటం వల్ల మన దేశంలో ఆహారదినుసుల ఉత్ప త్తి రికార్డు స్థాయిలో పెరిగింది . 2021-22 లో 316 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనాలను అధిగమించింది. అలాగే నూనె గింజలు ఉద్యానవన ఉత్పత్తులు కూడా పెరిగాయి. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించటానికి భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం -2013 ను తెచ్చింది . ఆహార లభ్యత ఆహార అందుబాటు ఆహార వినియోగం ఆహార స్థిరత్వం అనే నాలుగు అంశాలు ఈ చట్టంలోని ముఖ్యఅంశాలు . దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిని ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చింది .

అందుకనుగుణంగా మన రాష్ట్రంలోనూ తెలంగాణ ఫుడ్ సెక్యూరిటి రూల్స్ -2017 రూపొందించి తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర జనాభాలో 75% గ్రామీణ జనాభాను 50% పట్టణ జనాభాను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చింది. అయితే కేవలం ఆహారలభ్యత ఒక్కటే ఆకలిలేదని చెప్పడానికి ప్రాతిపదిక కాదని ఆ లభిస్తున్న ఆహారంలో తగు పోషకాలు ఉండాలన్న యూఎన్‌ఓ నిర్దేశాలను పాటించవలసిన అవసరం ఉంది . భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని , ప్రపంచదేశాలు భారత్ ను అనుసరిస్తే 2050 నాటికీ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని మన ఆహారవియోగం తీరు గురించి తాజాగా వరల్ వైల్ లైఫ్ ఫండ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2024 అభిప్రాయపడటం గమనార్హం .

అందరికి ఆహారం కోసం : 2030 నాటికీ అందరికి ఆహారం అందించి శూన్యపుటాకలి లక్ష్యసాధనకు భవిష్యత్తు దాన్యాలతో కూడిన దేశాలదే తప్ప తుపాకులతో కాదు అన్న ప్రఖ్యాత భారత వ్యవసాయ శాస్త్రవేత్త వరల్ ఫుడ్ ప్రైజ్ విజేత భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఏంఎస్ స్వామినాధన్ పరిశోధనల స్పూర్తిగా ప్రపంచ దేశాలన్నీకృషి చేయాలి . ఆహారాన్ని యుద్దఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలలో చోదకశక్తిగా పనిచేసినందుకు గాను వరల్ ఫుడ్ ప్రోగ్రాం సంస్థకు 2020 నోబెల్ శాంతి బహుమతి వరించడం విశేషం . ప్రజలందరికీ పోషకాహారాన్ని అందించడానికి వీలుగా వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే సుస్థిర వ్యవసాయ – ఆహార వ్యవస్థలు సేంద్రీయ వ్యవసాయం బయో టెక్నాలజీ మరియు లోకలైజ్డ్ డేటా ఆధారిత వ్యవసాయం, బహుళ అంతస్తుల వ్యవసాయ విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. రైతులకు వాతావరణ స్టేషన్లు మట్టి సెన్సార్ల ద్వార తేమ , పంట పెరుగుదల , తెగుళ్ళు తదితర విషయాలతో కూడిన డేటాఅనలిటిక్స్ పరిజ్ఞానాన్ని అందించాలి.

కృత్రిమ మేధ, మెషిన్ లర్నింగ్, రిమోట్ సెన్సింగ్ , డ్రోన్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించే అగ్రిటెక్ స్టార్టప్‌లకు సాయం అందించే డిజిటల్ అగ్రికల్చరల్ మిష న్ సేవలను విస్తరించాలి. నీటికొరత తట్టుకోగల వ్యాధి నిరోధక జన్యుసంకలన పర్యావరణహిత అధిక దిగుబడినిచ్చే పంటలసాగును ప్రోత్సహించాలి. గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులను పెంచి ఆహారసబ్సిడీ, మధ్యాహ్న భోజనం వంటి సామజిక భద్రతా వలయాలను విస్తరించాలి. అత్యంత ఆకలి దేశాలకు ధనిక దేశాలు ఆహారపదార్థాలను, ఆగ్రో టెక్నాలజీని ఉచితంగా అందించాలి . ప్రజలు తమ ఆహార పద్దతులను అలవాట్లను ప్రవర్తనలను మార్చుకొని చిరుధాన్యాలు, సముద్రపు అల్గే నుండి తయారైన ఆహారం, చేపలు, పోర్టీఫైడ్ ఆహార దినుసులను , క్లీన్ మీట్, సోయాచిక్కుళ్ళు మొదలగు సాంప్రదాయేతరఆహారాన్ని విరివిగా వాడాలని , ఆహారవృధాను అరికట్టాలని ఆహారనిపుణులు సూచిస్తున్నారు. మొదటి ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశం రోమ్ డిక్లరేషన్-1996 లో పేర్కొన్న విధంగా ప్రజలందరికి అన్ని కాలాల్లో తగినంత సురక్షితమైన ఆరోగ్యకరమైన సరసమైన నాణ్యమైన పోషకాహరంను అందుబాటులో ఉంచడం కోసం అందరికి ఆహారం అనే బృహత్తర లక్ష్యసాధనకై అందరం పాటుపడాలి .
వ్యాస రచయిత

డాక్టర్ భారత రవీందర్
(9912536316 )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News