బెంగళూరు: ప్రేమ జంట మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరులో రాజు అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సామసంత్రపాళ్యకు చెందిన సహానా(17) అనే యువతి పరిచయం కావడంతో రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరిగాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి రావాలని సహానాను రాజు కోరడంతో అతడి ఇంటికి వెళ్లింది. రాజు-సహానా మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో సహనం కోల్పోయిన రాజు కత్తి తీసుకొని సహానాపై దాడి చేశాడు. అనంతరం మల్లేశ్వరం చేరుకొని యశ్వంతపూర్ వెళ్లే రైలు ఎక్కాడు. కదులుతున్న రైళ్లో నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వెంటనే ప్రయాణీకులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు రాజు ఆత్మహత్యయత్నం గురించి తెలియగానే ఇంటికి వెళ్లి చూడగా సహానా రక్తపు మడుగులో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.