న్యూయార్క్ : ప్రపంచ మార్కెట్లకు ధాన్యాలు రవాణా చేయడం కోసం నల్లసముద్రంలోని షిప్పింగ్ కారిడార్‌ను ఉక్రెయిన్ వినియోగించుకుంటోందని, ఈ విధంగా తమ నౌకలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలకు, విద్రోహచర్యలకు ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి లోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా సోమవారం ఆరోపించారు. ఆ విధంగా ఉక్రెయిన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తే ఉక్రెయిన్ ధాన్యాల రవాణా నౌకలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లసముద్రం ప్రస్తుతం శత్రుత్వస్థావరంగా మారిందని, ఈ పరిస్థితుల దృష్టా తమ తనిఖీ లేనిదే ఆ మార్గం ద్వారా ఎలాంటి నౌకలను ఇకపై అనుమతించబోమని హెచ్చరించారు. ఇలాంటి నౌకల రవాణాను నియంత్రించడానికి రష్యా తన స్వయం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, సహాయంతో రష్యా నల్లసముద్ర నౌకలపై ఉక్రెయిన్ భారీ ఎత్తున వైమానిక, నౌకా దాడులకు అక్టోబర్ 29న పాల్పడిందని ఉదహరించారు.