Tuesday, December 24, 2024

ఆహార ధరల మంటలు!

- Advertisement -
- Advertisement -

Bail for Kerala journalist Siddique Kappan ఆహార ద్రవ్యోల్బణం హద్దు మీరడంతో దేశంలో అన్నమో రామచంద్రా అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. బతుకు ఖర్చు విపరీతంగా పెరిగిపోడంతో సాధారణ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆగస్టు నెలలో చిల్లర ద్రవ్యోలణం పెరుగుదల రేటు విజృంభించి విరుచుకుపడింది. జులైలో వున్న 6.7 శాతం నుంచి 7 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు పడిపోయింది. జూన్‌లో ఉన్న 12.7 శాతం నుంచి జులై నాటికి 2.4 శాతం తగ్గిపోయి 10.3 శాతానికి దిగిపోయింది.

ఆగస్టులో గ్రామీణ ద్రవ్యోల్బణం రేటు 7.15 శాతానికి చేరుకొంది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో గల 6.75 శాతం నుంచి జులై నాటికి 7.62 శాతానికి చేరింది. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయబోమంటూ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరి సాగును స్వయంగా నిరుత్సాహపరచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పడగ విప్పిన ఆహార ద్రవ్యోల్బణం ముందు నిస్సహాయంగా నిలబడింది. దాని ప్రభావాన్ని తగ్గించడానికి నూకల ఎగుమతిని నిషేధించింది. పలు రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం అదనపు సుంకాన్ని విధించింది. ఇది ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఆహార సంక్షోభం నెలకొంటుందని భావించి గోధుమ ఎగుమతులను ప్రభుత్వం గత మే నెలలోనే నిషేధించింది.

కొండెక్కిన కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలను తగ్గించడం అసాధ్యమవుతున్నది. దీని వల్ల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ ప్రజలకు దుర్భరంగా తయారయింది. వంట గ్యాస్ సిలిండర్ ధర అనూహ్యంగా పెరిగిపోడంతో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు తమ ప్రజలకు పలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. కనీసం పది రాష్ట్రాల్లో రూ. లక్ష కోట్ల మేరకు ఊరట చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆహారం ప్రియమైపోడంతో ప్రజల ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని అది రాజకీయంగా తమను తీవ్ర నష్టానికి గురి చేస్తుందని భావిస్తున్న రాష్ట్రాల పాలక పక్షాలు ప్రజలకు నగదు బదిలీలు, ఎలెక్ట్రిసిటీ ఛార్జీల తగ్గింపు వంటి చర్యలను తీసుకుంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి.

తెలంగాణలో నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తును చాలా కాలంగా ఉచితంగానే ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తెర దించి విద్యుత్తు ఉత్పాదన, పంపిణీ రంగాలను ప్రైవేటుకు అప్పగించి ప్రతి యూనిట్‌ను మార్కెట్ ధరకు రైతులు కొనుగోలు చేసేలా చేయాలని ప్రధాని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఇందు కోసం కొత్త విద్యుత్తు బిల్లును సిద్ధం చేసిన విషయం విదితమే. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ శాసన సభ మంగళవారం నాడు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు దేశ పురోగతికి, రైతుల ప్రయోజనాలకు, పేదల మేలుకు విరుద్ధంగా వున్నదని రాష్ట్రాల హక్కులను ఈ బిల్లు కాలరాస్తుందని ఆ తీర్మానంలో పేరొన్నది. ఆహార ధరాఘాతం నుంచి సామాన్య జనాన్ని కాపాడడానికి కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వం ఈ మాసారంభంలో ఓనమ్ పండుగ సందర్భంగా రూ. 450 విలువైన వంట సామగ్రి ప్యాకెట్లను 80 లక్షల కుటుంబాలకు పంచిపెట్టింది.

5 లక్షల మంది వ్యవసాయ కార్మికులకు మేలు కలిగేలా అదనంగా వెయ్యి గ్రామీణ ఉపాధి హామీ పనులను మంజూరు చేసింది. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మేరకు పరిమితికి లోబడి ఉచిత గృహ విద్యుత్తును, ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ పేదలకు ఉద్యోగ హామీ పథకాన్ని అమలు చేస్తున్నది. 50 యూనిట్ల మేరకు ఉచిత గృహ విద్యుత్తు ఇస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం విధానాలకు విరుద్ధంగా ఎలెక్ట్రిసిటీ ఛార్జీలను తగ్గించింది. పేద కుటుంబాలకు నగదు బదిలీ పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలు వాటి బడ్జెట్ వ్యయంలో 0.1 శాతం నుంచి 2.7 శాతం వరకు తమ ప్రజలకు ఉచితంగా సరకులు, సేవలు అందించడానికి వినియోగిస్తున్నట్టు రిజర్వు బ్యాంక్ పరిశోధనలో వెల్లడైంది.

ఉచితాలపై అదే పనిగా ఉరుముతున్న ప్రధాని మోడీ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. దేశ జనాభాలో సగం మంది ఆదాయాలు పెరగకపోగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేయడం, కార్పొరేట్ల సుంకాలను తగ్గించివేసి సామాన్యులపై పాలు, పెరుగు పన్నులను కూడా విధించే ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పవలసి వుంది. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు నిజమైన ఊరట కలిగించే చర్యలను ప్రకటించవలసి వుంది. పారిశ్రామిక, తయరీ వస్తువుల ఉత్పాదనను, ఎగుమతులను పెంచి ప్రజలకు ఉద్యోగావకాశాలను విరివిగా కల్పించవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News