Thursday, November 21, 2024

బాలుర గురుకుల పాఠశాలలో 34 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని అధికారులు, పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది. మున్సిపల్ కేంద్రంలో రెండు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తుండగా వడ్డెర కాలనీ వద్ద భవనంలో 8వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు 263 మంది విద్యార్థులు, కొత్త బస్టాండ్ వద్ద మూతపడిన ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల భవనంలో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 261 మంది విద్యార్థులు చదువుతున్నారు.

శుక్రవారం రాత్రి భోజనం చేసిన 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల్లో 34 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాఠశాల హెల్త్ సూపర్ వైజర్ మంగమ్మ, ఉపాధ్యాయులు విద్యార్థులను 108లో మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి హేమంత్ కుమార్, డాక్టర్ నిరోశ తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులకు వెంటవెంటనే స్లైన్లు ఎక్కించి చికిత్స చేశారు. విద్యార్థులంతా కొంతమేర కోలుకోవడంతో ఉదయం వరకు ఆస్పత్రిలోనే ఉంచితే విషయం బయటకు పొక్కి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో శనివారం తెల్లవారు జామున మూడు, నాలుగు గంటల సమయంలో విద్యార్థులందరినీ పాఠశాలకు తరలించి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు.

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటస్వామి కలెక్టర్ పమేలా సత్పతికి తెలియజేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ రజిని, డీసీవో శ్రీరాంశ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, పీవో ఎన్‌సీడీ డాక్టర్ సుమన్ కల్యాణ్ శనివారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు విద్యార్థులను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయడంతో విద్యార్థులంతా పూర్తిగా కోలుకున్నారు.

విద్యార్థులు కొంత నీరసంగా ఉండటంతో వారికి పెరుగుతో భోజనం పెట్టారు. ఫుడ్ సెక్కూరిటీ ఆఫీసర్లు శ్వేత, స్నిగ్ధ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పెట్టిన భోజనం శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, విద్యార్థులంతా పూర్తిగా కోలుకున్నారని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ రజిని, పీహెచ్‌సీ వైద్యాధికారి హేమంత్ కుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News