Sunday, December 22, 2024

ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : గురువారం రాత్రి వండిన వంకాయ, సాంబార్, పెరుగు అన్న తినడంతో 70 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని పామిరెడ్డి పల్లి శివారులో ఉన్న కస్తూర్భా గాంధీ పాఠశాలలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఉదయం 7 గంటలకు పాఠశాలలో విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి 70 మంది విద్యార్థులకు వాహనాలలో తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్సలు నిర్వహించారు. 17 మంది విద్యార్థులకు తీవ్ర తలనొప్పి, విరోచనాలు కావడం వల్ల వైద్యుల ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవి కుమార్ యాదవ్, బిఆర్‌ఎస్ అమరచింత మండల అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, యువజన సంఘం నాయకులు పలువురు ఆసుపత్రికి చేరుకుని తమ సేవలను అందించారు.

విద్యార్థులను అంబులెన్స్‌లో వనపర్తి తరలించారు. వనపర్తి అదనపు వైద్యాధికారి శ్రీనివాసులు, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులకు చికిత్సలు చేశారు. భయపడాల్సిన అవసరం లేదని విద్యార్థులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న వారు సైతం బాగున్నారని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డిఓ పద్మావతి ఆసుపత్రికి చేరుకోగా విద్యార్థులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం లేదని, తమతోనే పనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆర్డిఓ దృష్టికి తీసుకెళ్లారు. పురుగుల అన్నం, చెడిపోయిన కూరగాయలతో వంటలు వండుతున్నట్లు ఆర్డిఓకు ఫిర్యాదు చేశారు. చికిత్సలు అందించిన వారిలో డిఐఓ పరిమళ, ప్రోగ్రాం అధికారి రామచంద్ర రావు, డిఎస్‌ఓ సాయినాథ్ రెడ్డి, హరినారాయణ, సిఐఎఎస్ ఇఎన్‌టి సర్జరీతో పాటు పలువురు వైద్యులు విద్యార్థులకు వైద్య చికిత్సలు చేసి సాయంత్రం విద్యార్థులను డిశ్చార్జి చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ః ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్భా గురుకుల పాఠశాల బలోపేతానికి కృషి చేస్తుందని సిబ్బంది, కాంట్రాక్టర్ నిర్లక్షం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News