సచివాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రంగంలోకి దిగారు. సచివాలయం క్యాంటిన్‌కు ఆహార పదార్థాలను బయటి నుంచి సరఫరా చేసే ఏజెన్సీ కిచెన్‌లో శనివారం తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ , మూడవ ఫ్లోర్లలో క్యాంటిన్లను నిర్వహిస్తున్నారు. వీటిని మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి. వాటికి వంట చేయడానికి సచివాలయంలో అనుమతి లేదు. వీటికి బయటి నుంచి ఒక ఏజెన్సీ ద్వారా ఆహార పదార్థలను సరఫరా చేస్తారు.
తాజాగా సచివాలయం క్యాంటిన్ నుంచి సరఫరా చేసిన ఆహార పదార్థాలు కలుషితం అయినట్టు ఫిర్యాదు రావడంతో ఏజెన్సీ కిచెన్ ఆహార పదార్థాల ముడిసరుకులు, ఆహార నాణ్యతను ఫుడ్ సేప్టీ ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. ముఖ్యమంత్రి పేషీతో సహా మంత్రుల పేషీలకు, హెచ్‌ఓవోడి విభాగాలకు కలుషిత ఆహార పదార్థలను సరఫరా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం పలువురు అధికారులకు ఫుడ్ పాయిజన్‌కు గురి అయినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన వెంటనే విచారణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫుడ్ సేప్టీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.