ఉక్రెయిన్ స్థితిపై డబ్లుటిఒ హెచ్చరిక
న్యూయార్క్ : ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పేదదేశాలలో ఆకలి బాధలు ఎక్కువవుతాయి. ఇది చివరికి అంతర్ఘషణలకు దారితీస్తుందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) హెచ్చరించింది. ఇప్పటికే పలు దేశాలలో నిత్యావసరాల కటకట ఏర్పడింది. ధరలు ఎగబాకాయి. పేదదేశాలకు ఇంతవరకూ అందుతున్న వివిధ స్థాయి ఔదార్యపు సాయం నిలిచిపోతోంది. దీనితో పేదలు మరింతగా తిండిగింజలకు నోచుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషించారు. పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో అనే భయంతో ఆహార ఉత్పత్తి దేశాలు సరుకులను నిల్వచేసుకుంటాయి. సరఫరాలు ఆగిపోతాయి. నల్ల సముద్ర ప్రాంతం నుంచి ఆహార సరఫరాలపై ఆధారపడుతున్న పలు ఆఫ్రికా దేశాల పరిస్థితి మరింత దయనీయం అవుతుందని సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్‌గోజి ఒకోంజో ఐవెలా హెచ్చరించారు. కొవిడ్ తరువాతి లాక్‌డౌన్ నాటి పరిస్థితులు తలెత్తకుండా సంపన్న దేశాలు చూసుకోవడమే కాదు పలు పేదదేశాలు సంకటస్థితిని అనుభవించకుండా చేసే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.