మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) జాతీయ సర్టిఫికేట్ ‘భోగ్’ -బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ గుర్తింపు లభించింది. దేశంలో 70పైగా దేవాలయాలు ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రాష్ట్రంలోని రెండు దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వంటి ప్రముఖ దేవాలయాలకు మాత్రమే ఇప్పటివరకు ఈ గుర్తింపు రాగా, తెలంగాణలో రెండు దేవాలయాలకు రావడం విశేషం. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం, యాదాద్రి, వర్గల్ దేవాయాలు సందర్శించి, నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసింది.
ఫుడ్ సేఫ్టీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్ గుర్తింపుకు రిఫర్ చేసింది. భోగ్ సర్టిఫికేట్ సాధించేందుకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం ఎంతో కృషి చేసింది. ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధికారిణిగా అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలోని బృందం యాదాద్రి, వర్గల్ దేవాలయాల్లో నైవేద్యం, అన్న ప్రసాదాలు తయారు చేసే క్రమంలో అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించారు. శుభ్రత విషయంలో పాటించాల్సిన పద్ధతులు వివరించారు. దీంతో కేంద్ర బృందం జరిపిన ఫైనల్ ఆడిట్ అనంతరం రాష్ట్రంలోని రెండు దేవస్థానాలకు మొట్ట మొదటి సారిగా భోగ్ గుర్తింపు లభించింది.
భోగ్ గుర్తింపు లభించడం గొప్ప విషయం :మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో తొలిసారిగా యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు భోగ్ గుర్తింపు లభించడం సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకు కృషి చేసిన ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకు ఈ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, వారికి అత్యంత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.