Sunday, December 22, 2024

ప్రత్యేక హక్కుతోనే ఆహార భద్రత

- Advertisement -
- Advertisement -

ప్రపంచ మానవాళికి ఆహార భద్రత సమస్యగా పరిణమించింది. ప్రతి ఏటా అక్టోబర్‌లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 1945 నుండి ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహిస్తుంది. ప్రపంచంలోని సభ్య దేశాల ప్రభుత్వాలకు ఆహార భద్రత కోసం తీసుకోవాల్సిన కార్యాచరణను సూచి స్తూ ఆహార భద్రత మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆహారానికి, నీటికి అవినాభావ సంబంధం ఉంది. నీరు, ఆహారమే ప్రపంచ పౌరులందరికీ నీటి ప్రాధాన్యత మీద దృష్టి పెట్టింది. ‘2023 సంవత్సరాన్ని నీరు జీవం నీరు ఆహారం’ అనే నినాదంతో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతున్నారు. జనాభా పెరుగుదలకు కనుగుణంగా నీటి వనరుల పరిరక్షణ జరగడంలేదు.

పెరుగుతున్న పట్టణీకరణ, ప్రకృతి విపత్తులు, పర్యావరణ కాలుష్యం, విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక మాఫియా వ్యాపారం వల్ల భూగర్భ జల లభ్యత తగ్గి నీటి కొరత వల్ల కరువులు కాటకాలు ఏర్పడి 29% ప్రాంతాలు కరువును ఎదుర్కొంటున్నాయి. ఒక వైపు కరోనా మహమ్మారి మరొక వైపు పర్యావరణ సంక్షోభం దీనికి తోడు అనేక దేశాలలో అంతర్గత యుద్ధాలు వెరసి ఆకలి చావులు పెరుగుతున్నాయి. పలు దేశాలలో కరవు కరాళ నృత్యానికి ఎంతో మంది ఆకలి చావులకు బలి అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. కోవిడ్ మరణాల కంటే ఆకలి చావుల గణాంకాలు ప్రభుత్వాలకు సవాలుగా పరిణమించింది.

రాజకీయ అస్థిరత వున్న దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయని. పలు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు, రాజకీయ అస్థిరత రాజ్యమేలడం వల్ల పేద దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే ఆక్స్‌ఫామ్ సంస్థఈ బాధాకరమైన విషయాలను వెల్లడించింది. ఆకలి కారణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ప్రస్తుత సంవత్సరం 6 రెట్లు ఎక్కువగా వుందని అంచనా వేసింది. 2021లో ప్రపంచ జనాభాలో 10% జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30% జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్టమైన ఆహార భద్రత విధానం, నిరుద్యోగం పెరగడం, ఆహార కొరత పెరగడం, గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉన్న విషయాన్ని వెల్లడించింది.

దేశంలో 2021 22లో 315 టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8% ఉండగా, 2020 నాటికి 15.3 శాతానికి చేరుకొన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. పోషకాహారం లోపంవల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత దేశంలో దాదాపు14% (190 మిలియన్లు) ప్రజలు, పోషకారం లోపంతో 5ఏండ్లలోపు వయసు వున్న పిల్లలు 20% తక్కువ బరువుతో వున్నారు.

52% 15 49 యేండ్లలోపు మహిళల్లో రక్తహీనతతో సతమతమవుతున్నారని అంచనాలు తెలుపుతున్నాయి. ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 2021లో 116 దేశాల్లో ఆకలి సూచికలో భారత దేశం స్థానం అట్టడుగు 101 స్థానంలో వుండడం విచారకరం. 2020లో భారత్ స్థానం 94 వుండగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65 వ స్థానం, బంగ్లాదేశ్ 76వ స్థానం, పాకిస్థాన్ 92 స్థానాల్లో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15.5 కోట్ల మంది ప్రజలు ఆహార సంక్షోభంలో బతుకుతున్నారని, ఈ సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఇది రెండు కోట్లు ఎక్కువ అని, కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్ కూడా ఆహార సంక్షోభానికి కారణమైందని అధ్యయనంలో తేలింది. అఫ్ఘానిస్తాన్, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ లాంటి యుద్ధ్ద సంక్షోభాలు వున్న దేశాలలో ఆకలి చావుల తీవ్రత ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫామ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రతి రోజు 5 లక్షల మందికి తిండి దొరకని పరిస్థితి ప్రపంచంలో నెలకొని వుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు, ప్రపంచంలో సంభవిస్తున్న ఆర్థిక పరిణామాలు ధరలు 40% పెరుగుదలకు కారణమైందని పేర్కొంది.వాతావరణ విపత్తు ల వల్ల 520 లక్షల మంది కడు పేదరికంలోకి నెట్టవేయబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తమ తమ బలగాల పటిష్టతకు కోసం 5100 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చడానికి ఐక్యరాజ్య సమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా 6 రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్ సంస్థ వెల్లడించింది. అంతర్గత యుద్ధాలు, ఉగ్రవాదం, విచ్ఛిన్నకర పరిస్థితులు ఆహార సంక్షోభానికి శాపంగా పరిణమించాయని ఆక్స్‌ఫామ్ సంస్థ తెలిపింది.

ధనిక దేశాలు ఐక్యరాజసమితి ద్వారా ఆకలి చావులు ఎక్కువగా వున్న దేశాల్లోని ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలని ఆక్స్ ఫామ్ సంస్థ సూచించింది. భారత దేశంలో ఆకలి చావులు ఉండకూడదని, ప్రజల సంక్షేమం ప్రభుత్వాల రాజ్యాంగపరమైన బాధ్యత అని, కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళికలు రూపొందించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక నుంచి ఆకలి చావులు అనే మాట వుండకూడదని, దీని కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తున్నది వెంటనే తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోధుమలు ఇవ్వడం కాదు. దారిద్య్ర రేఖకు కింద వున్న వారికి పౌష్ఠికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత ఏర్పడుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన, తగినంత సురక్షిత పౌష్ఠికాహారం ప్రజలందరికీ అందించాలి. అన్నికాలాల్లో ఆర్థికంగా, భౌతికంగా అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి వ్యక్తి సురక్షితమైన పౌష్ఠికాహారాన్నీ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత కలిగి వుండాలి.

నేటికీ దేశ జనాభాలో 14 % అల్ప పౌష్ఠికాహారంతో బాధపడుతున్నారు. 15 45 వయసులో వున్న మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఉపాధి హామీ పథకం అమలుచేయడం, మౌలిక సదుపాయాలు కల్పన, ఆదాయ సృష్టి, జీవన ప్రమాణాల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి అభివృద్ధితో జాతీయాదాయానికి దోహదపడే సూక్ష్మ, స్థూలవిధానాలు, ఆర్థిక ప్రణాళికలు అమలు చెయ్యాలి.ఆహారం, పాలు, గుడ్లు, కూరగాయల ఉత్పత్తిలో మితి మీరి వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్నితగ్గించాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధ్దతి ద్వారా కల్తీ లేని ఆహార ధాన్యాలను అందుబాటులో వుంచి ప్రజలకు మెరుగైన పౌష్ఠికాహారం సమకూర్చాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి సమగ్రమైన ఆహార భద్రత సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఆకలి చావులను అరికట్టడానికి సమగ్ర సంతులిత పౌష్ఠికాహార పథకాలను అమలు చేయాలి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో ఆత్మనిర్బరత కేంద్ర బిందువుగా ఆహార భద్రత వ్యవస్థ పరిపుష్టికి దీర్ఘకాలిక వ్యూహాలతో బహుముఖ కార్యాచరణకు ప్రభుత్వం పూనుకోవాలి. ఆకలి చావులులేని స్వయం సమృద్ధి భారత్ ఆవిర్భానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.

నేదునూరి కనకయ్య
9440245771

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News