Monday, December 23, 2024

సౌత్ సమస్యలు పట్టని వెస్ట్

- Advertisement -
- Advertisement -

కొవిడ్ మహమ్మారి, అధిక రుణ సేవలు, ఇంధన ధరలతో పాటు వారి జీవితాలను నాశనం చేస్తున్న వాతావరణ సంక్షో భం, కరువులు, పేదరికం, ఆహార కొరతలతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై పాశ్చాత్య దేశాలు పెదవి విప్పడం లేదు. దక్షిణాది ప్రపంచం పట్ల ఏ బాధ్యతా వహించడం లేదు. కానీ రష్యాపై ఆంక్షలు విధించడంలో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమతో కలిసి రావాలని పాశ్చాత్య దేశాలు పట్టుబడుతున్నాయి.

తమ ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో కొవిడ్ వ్యాక్సిన్ల సాంకేతికతను, మేధో సంపత్తి హక్కును తమతో పంచుకోమని, దక్షిణ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఏ పాశ్చాత్య దేశం కూడా దానికి సిద్ధం కాలేదు. ఆఫ్రికా నేటికీ టీకా తీసుకోని ఖండంగా ఉండిపోయింది. ఆఫ్రికాకు వ్యాక్సిన్లను తయా రు చేయగల సామర్థ్యం ఉంది, కానీ మేధో సంపత్తి లేకుండా వారు చేయలేరు. దక్షిణ దేశాలకు మహమ్మారి కాలంలో రష్యా, చైనా, భారత్‌ల నుంచి సాయం అందింది.

ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన ఎనిమిది నెలల తర్వాత- 2022 అక్టోబర్‌లో- యుకెలోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం 137 దేశాల్లో సర్వేలు నిర్వహించింది. పాశ్చాత్య దేశాల పట్ల, రష్యా, చైనాల పట్ల ఆయా దేశాల వైఖరుల గురించి అధ్యయనం చేసింది. వారు వెల్లడించిన అంశాలలో ముఖ్యమైనవి పాశ్చాత్య దేశాల వెలుపల నివసిస్తున్న 630 కోట్ల ప్రజలలో -66% మంది రష్యా పట్ల, 70% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. రష్యా పట్ల సానుకూలంగా వున్న వారిలో దక్షిణాసియాలో 75%, ఆఫ్రికాలో 68%, ఆగ్నేయాసియాలో 62% మంది ఉన్నారు. సౌదీ అరేబియా, మలేషియా, భారత దేశం, పాకిస్తాన్, వియత్నాంలలో రష్యా పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉంది.

ఈ భావాలు పాశ్చాత్య దేశాలలో కొంత ఆశ్చర్యాన్ని, అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా కలిగించాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది తమ దేశాలవైపు మొగ్గు చూపడం లేదన్న వాస్తవం నమ్మడం వారికి చేదుగా వుంది. ఈ స్థితికి గల కారణాలు ఏమిటి?

1. పాశ్చాత్య దేశాలు తమ సమస్యలను అర్థం చేసుకుంటాయని, సానుభూతి చూపుతాయని దక్షిణాది దేశాలు (గ్లోబల్ సౌత్) నమ్మటం లేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఐరోపా సమస్యలు ప్రపంచ సమస్యలే, కానీ ప్రపంచ సమస్యలు ఐరోపా సమస్యలు కావు అనే మనస్తత్వం నుండి ఐరోపా బయట పడాలి’ అని అన్నారు. కొవిడ్ మహమ్మారి, అధిక రుణ సేవలు, ఇంధన ధరలతో పాటు వారి జీవితాలను నాశనం చేస్తున్న వాతావరణ సంక్షోభం, కరువులు, పేదరికం, ఆహార కొరతలతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై పాశ్చాత్య దేశాలు పెదవి విప్పడం లేదు. దక్షిణాది ప్రపంచం పట్ల ఏ బాధ్యతా వహించడం లేదు. కానీ రష్యాపై ఆంక్షలు విధించడంలో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమతో కలిసి రావాలని పాశ్చాత్య దేశాలు పట్టుబడుతున్నాయి.
తమ ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో కొవిడ్ వ్యాక్సిన్ల సాంకేతికతను, మేధో సంపత్తి హక్కును తమతో పంచుకోమని, దక్షిణ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఏ పాశ్చాత్య దేశం కూడా దానికి సిద్ధం కాలేదు.

ఆఫ్రికా నేటికీ టీకా తీసుకోని ఖండంగా ఉండిపోయింది. ఆఫ్రికాకు వ్యాక్సిన్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది, కానీ మేధో సంపత్తి లేకుండా వారు చేయలేరు. దక్షిణ దేశాలకు మహమ్మారి కాలంలో రష్యా, చైనా, భారత్‌ల నుంచి సాయం అందింది. రష్యాకు చెందిన స్పుత్నిక్- వి వ్యాక్సిన్ల మొదటి బ్యాచ్‌ను అందుకున్న తర్వాత అల్జీరియా 2021 జనవరిలో తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే సమయంలో చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ పొందిన తర్వాత ఈజిప్టు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దక్షిణాఫ్రికా పది లక్షల డోసుల ఆస్ట్రాజెనెకాను కొనుగోలు చేసింది. అర్జెంటీనాలో వారి వ్యాక్సిన్ కార్యక్రమానికి స్పుత్నిక్-వి వెన్నెముకగా నిలిచింది. ఆ సమయంలో పాశ్చాత్య దేశాలు ముందుగానే మిలియన్ల డోసులను కొనుగోలు చేసి దాచి వేశారు. ఉపయోగించక కాలం చెల్లిన వ్యాక్సిన్లను నాశనం చేశారు. మీ సమస్యలు మీకే సమస్యలు, అవి మా సమస్యలు కావు అని దక్షిణ భూగోళానికి ఒక సందేశం స్పష్టంగా వెళ్ళింది.

2. వలస పాలన సమయంలో, స్వాతంత్య్రానంతరం ఎవరు ఎక్కడ ఉన్నారనే చరిత్ర విషయాలు:
లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని పాశ్చాత్య దేశాల కంటే భిన్నమైన కోణంలో చూస్తున్నాయి. పూర్వం తమపై వలసాధిపత్యం వహించిన పాశ్చాత్య రాజ్యాలు ఒక కూటమిగా సంఘటితమయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించినది యూరోపియన్ యూనియన్, నాటో సభ్యదేశాలు లేదా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు. దీనికి విరుద్ధంగా, ఆసియాలోని అనేక దేశాలు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దాదాపు అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలను తొలగించడానికి ప్రయత్నించాయి. ఎందుకంటే పాశ్చాత్యుల వలస విధానాలను, తమ చరిత్రను వారు మరిచిపోలేదు. పాశ్చాత్య దేశాలకది చాలా వరకు మరచిపోయిన వృత్తాంతమయితే, దక్షిణ దేశాలకది ఇప్పటికీ రక్తపు తడి ఆరని గాయమే.

వర్ణ వివక్ష పాలనను కూలదోయడానికి దక్షిణ ఆఫ్రికన్లను ప్రేరేపించడానికి సోవియట్ యూనియన్ నైతిక, భౌతిక మద్దతు ఎంతో సహాయపడిందని నెల్సన్ మండేలా తరచుగా చెప్పేవారు. ఈ కారణంగానే రష్యాను ఇప్పటికీ అనేక ఆఫ్రికా దేశాలు అనుకూల కోణంలో చూస్తున్నాయి. ఈదేశాలకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ తన పరిమిత వనరులతోనేవారి అభివృద్ధికి మద్దతు ఇచ్చింది. ఈజిప్టులోని అస్వాన్ ఆనకట్ట నిర్మాణానికి, కొత్తగా స్వతంత్రమైన భారత దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటైన భిలాయ్ ఉక్కు కర్మాగారానికి, ఘనా, మాలి, సూడాన్, అంగోలా, బెనిన్, ఇథియోపియా, ఉగాండా, మొజాంబిక్ వంటి ఇతర దేశాలకు కూడా మాజీ సోవియట్ యూనియన్ సహాయపడింది.
2023 ఫిబ్రవరి 18న ఇథియోపియాలోని అడిస్ అబాబాలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో ఉగాండా విదేశాంగ మంత్రి జెజెఒడోంగో ‘మేము వలస రాజ్యంగా చేయబడ్డాము.

మమ్మల్ని కాలనీలుగా చేసినా వారిని మేము క్షమించాము.కానీ అదే వలసవాదులు ఇప్పుడు మమ్మల్ని రష్యాకు శత్రువులుగా ఉండమని అడుగుతున్నారు. రష్యా మా మీద ఆధిపత్యం చలాయించలేదే! వలసవాదులు తమ శత్రువులను మా శత్రువులుగా చూడమంటున్నారు. ఇది సమంజసమేనా? వారి శత్రువులు వారికే శత్రువులు. మా మిత్రులు మాకు మిత్రులే అని వ్యాఖ్యానించారు. తప్పో, ఒప్పో దక్షిణంలోని అనేక దేశాలు ప్రస్తుత రష్యాను మాజీ సోవియట్ యూనియన్‌ను సైద్ధాంతిక వారసుడిగా చూస్తున్నాయి. ఈ దేశాల చారిత్రిక నేపథ్యం, సుదీర్ఘ జ్ఞాపకాల వల్ల వారు రష్యాను కొంత భిన్నమైన కోణంలోచూస్తున్నారు. దానిని మనమెలా కాదనగలం?

3. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది ప్రపంచ భవిష్యత్తు కోసం కాదు, ఐరోపా భవిష్యత్తు, భద్రత గురించి మాత్రమే అని దక్షిణ దేశాలు భావిస్తున్నాయి. శక్తివంతమైన దేశాల మధ్య సంఘర్షణలలో చిక్కుకోవడం వల్ల అపారమైన ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందని ప్రచ్ఛన్న యుద్ధ చరిత్ర ఈ దేశాలకు బోధించింది. ఆబోతుల పోట్లాటలో లేగలు నలిగిపోతాయని వారికి తెలుసు. ఉక్రెయిన్ పరోక్ష యుద్ధాన్ని వారు మొత్తం ప్రపంచం భవిష్యత్తు కోసం కంటే యూరోపియన్ భద్రత, భవిష్యత్తుల దృష్టితో జరుగుతున్న పోరాటంగా చూస్తున్నారు. అంతేకాక, దక్షిణాది ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యల నుండి దృష్టి మరల్చడంగా చూస్తున్నారు. అధిక ఇంధన ధరలు, ఆహార ధరలు, అధిక రుణ సేవా వ్యయాలు, అదుపు లేని ద్రవ్యోల్బణం వంటి సమస్యలున్నాయి, ఇవన్నీ రష్యాపై విధించిన పాశ్చాత్య ఆంక్షల కారణంగా మరింత తీవ్రమయ్యాయి.

గత ఏడాది కాలంలో పెరిగిన ఇంధన ధరల కారణంగా 14 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడుతారని నేచర్ ఎనర్జీ ఇటీవల ప్రచురించిన ఒక సర్వే పేర్కొంది. పెరుగుతున్న ఇంధన ధరలు నేరుగా ఇంధన బిల్లులను ప్రభావితం చేయడమే కాకుం డా, ఆహారం, ఇతర అత్యవసరాలతో సహా అన్ని సరఫరా గొలుసులపై, వినియోగ వస్తువులపై ధరల ఒత్తిడికి దారితీస్తాయి. ఇది పాశ్చాత్య దేశాలను బాధించే దాని కంటే అధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు హాని కలిగిస్తుంది. పాశ్చాత్య దేశాలు యుద్ధాన్ని ‘అవసరమైనంత కాలం’ కొనసాగించగలవు, ఎందుకంటే వారికి ఆర్థిక వనరులు, మూలధన మార్కెట్లు ఉన్నాయి. కానీ దక్షిణ ప్రపంచానికి ఆ సౌకర్యం లేదు.

యూరోపు భవిష్యత్తు పేరిట జరుగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచ భద్రతను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ యుద్ధాన్ని త్వరగా ముగించే చర్చలను పాశ్చాత్య దేశాలు కొనసాగించడం లేదని ఈ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. 2021 డిసెంబరులో రష్యా సవరించిన భద్రతా ఒప్పందాలను ప్రతిపాదించినప్పుడు; ఏప్రిల్ 2022లో ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు నిర్వహించినప్పుడు కూడా పాశ్చాత్య దేశాలు తిరస్కరించాయి. యుద్ధా న్ని ముగించే అవకాశాలను తృణీకరించాయి. రష్యాను ‘బలహీనపరచడానికి’ యుద్దం కొనసాగాలని వారు భావించారు. ఇప్పుడు పాశ్చాత్య మీడియా ‘అకారణమైన దండయాత్ర’ అని పిలిచే యుద్ధానికి యావత్ ప్రపంచం మూల్యం చెల్లిస్తున్నది.

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News