లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: ఎంపీలు, ఇతరులకు అత్యంత సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందచేసే పార్లమెంట్ క్యాంటీన్‌లో ఇక ఆ సౌకర్యం ఉండదు. పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆహార వదార్ధాలకు అందచేస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ఈ చర్య వల్ల ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలను స్పీకర్ వెల్లడించనప్పటికీ సబ్సిడీ నిలిపివేత వల్ల లోక్‌సభ సచివాలయానికి ఏటా రూ. 8 కోట్లకు పైగా ఆదా అవుతుందని వర్గాలు తెలిపాయి.
జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న తదుపరి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఓం బిర్లా విలేకరులకు వివరిస్తూ ఇక నుంచి పార్లమెంట్ క్యాంటీన్లు ఉత్తర రైల్వే స్థానంలో ఐటిడిసి నిర్వహిస్తుందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే ఎంపీలందరూ కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రాజ్యసభ సమావేశాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు, లోక్‌సభ సమావేశాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి.
ప్రశ్నోత్తరాల సమయం ముందుగానే నిర్ణయించిన మేరకు ఒక గంట సేపు జరుగుతుంది. ఎంపీలు తమ ఇంటి వద్దనే ఆర్‌టిపిసిఆర్ కొవిడ్-19 పరీక్ష చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. జనవరి 27-28 తేదీలలో పార్లమెంట్ ప్రాంగణంలో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తారని ఓం బిర్లా తెలిపారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు ఖరారు చేసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంపీలకు కూడా వర్తిస్తుందని ఆయన చెప్పారు.