Saturday, December 28, 2024

సబ్సిడీల తగ్గింపు కుట్ర!

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఈ తగ్గింపులు ఇంతకు ముందు బడ్జెట్ నుండే ప్రారంభమైంది. 2021- 22 సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌లో ఆహార సబ్సిడీ రూ. 2,86,469 కోట్లు ఉండగా, 2022 -23 బడ్జెట్‌లో రూ. 2,06,831 కోట్లకు తగ్గింది. ఎరువుల సబ్సిడీని రూ. 1,40,122 కోట్ల నుండి రూ. 1,05,222 కోట్లకు తగ్గించారు. ఎరువుల సబ్సిడీని తగ్గించడానికి వ్యవసాయ రసాయన ఇన్‌పుట్‌లలో సరకుల ద్రవ్యోల్బణం పెరగటం, కొరతకు దారితీయటం, గత సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎరువుల సబ్సిడీ పెంచటం వలన 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ ఖర్చు అసలు బడ్జెట్ కేటాయింపుల నుండి సవరించిన అంచనాకు 76% కంటే ఎక్కువ పెరగటం కారణంగా ప్రభుత్వ ప్రతినిధి తెలియచేశాడు.

ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ రూ. 2,42,836 కోట్ల నుంచి రూ. 2,86,469 కోట్లకు పెరిగిందని, పెరిగిన ఆహార, ఎరువుల సబ్సిడీ ప్రభుత్వానికి భారం కావటం వలన 2023 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సబ్సిడీలను తగ్గించనున్నట్లు మోడీ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)కి సబ్సిడీ కోసం సవరించిన అంచనా రూ. 2,02,616 కోట్ల నుంచి రూ. 2,10,929కు పెరిగి, 2022- 23 బడ్జెట్‌లో రూ. 1,45,919 కోట్లకు పెరిగింది. ఆహార, ఎరువుల సబ్సిడీ పెరుగుదల, తగ్గింపు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేసిందే. ఉత్తరప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకతను దారి మళ్ళించే విధంగా 2021- 22 బడ్జెట్‌లో ఎరువుల, ఆహార సబ్సిడీని పెంచి లబ్ధి పొందింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2022-23 బడ్జెట్‌లో సబ్సిడీని పెద్ద మొత్తంగా తగ్గించింది. ఇప్పుడు ఇంకొకసారి రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. మోడీ ప్రభుత్వం ఆహార, ఎరువుల సబ్సిడీయే కాకుండా అంతకుముందు అనేక సబ్సిడీలను ఎత్తి వేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30.5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఉన్నాయి.

2014లో వంటగ్యాస్ ధర రూ. 414 ఉంది. 2019లో రూ. 769 రూపాయలకు పెరిగింది. ఆధార్ లింక్ చేసిన వినియోగదారులకు కొంత కాలం 260 రూపాయల సబ్సిడీ వారి ఖాతాల్లో జమ అయింది. ఆ తర్వాత సబ్సిడీని రద్దు చేశామని చెప్పకుండానే దాన్ని ఆపివేసింది. 2021 జనవరిలో సిలిండర్ ధర రూ. 23 తగ్గించి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 11వందల దాకా ఉంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉన్న 9 కోట్ల మందికి మాత్రమే 200 రూపాయల సబ్సిడీ ఇస్తున్నది. అది కూడా త్వరలో ఎత్తి వేస్తుందనటంలో సందేహానికి ఆస్కారమే లేదు. 2010లో యుపిఎ ప్రభుత్వం పెట్రోల్‌పై సబ్సిడీ తొలగిస్తే, మోడీ ప్రభుత్వం 2014 నవంబర్‌లో డీజిల్‌పై ఉన్న సబ్సిడీని తొలగించింది. ఇంతకు ముందే కిరోసిన్‌పై ఉన్న సబ్సిడీని తొలగించారు. రైల్వే ప్రయాణంలో వృద్ధులకు ఉన్న రాయితీని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా అనేక రాయితీలు తొలగించబడ్డాయి. పేదలు, రైతాంగం, మధ్య తరగతి ప్రజలు రాయితీలు, సంక్షేమ పథకాల కోసం పాలకులపై ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది.

స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని పాలించిన, పాలిస్తున్న ఏ పార్టీ పాలక ప్రభుత్వం అయినా దేశ ప్రజల ప్రయోజనాలు విస్మరించి, దేశ సహజ వనరులను సామ్రాజ్యవాదులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నాయి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో వాటి ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలు అమలు జరుపుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ షరతులను ఆమోదించి ప్రైవేటీకరణ విధానాలతో పాటు దేశంలోకి విదేశీ పెట్టుబడులను రక్షణ రంగంతో సహా అన్ని రంగాల్లోకి మోడీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. కొన్ని సంస్థల్లో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయటం, వ్యవసాయ ఒప్పందాలను ఆమోదించి బహుళ జాతి సంస్థల వ్యాపారానికి ద్వారాలు బార్లా తెరిచింది. పాలకులు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశ సంపద సామ్రాజ్యవాదులు తరలించుకు పోవటమే కాకుం డా, వారితో మిలాఖత్ అయిన బడా పెట్టుబడిదారుల వద్ద పోగుపడి ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పేదలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ, పట్టణ పేదలు, కార్మికులు, రైతాంగం వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు ప్రారంభించారు. ఉద్యమాలకు భయపడిన పాలకులు ప్రజలకు కొన్ని రాయితీలు ప్రకటించారు. వాటిల్లో ఆహార, ఎరువుల సబ్సిడీలు ప్రధానమైనవి. వీటిని కూడా పాలక పార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకొంటున్నాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్స్ పెట్టుబడి ఎగుమతి ప్రారంభమైంది. దీనికి దేశం, రాజ్యం అదుపు ఉండదు. ఏ దేశానికీ అది ప్రాతినిధ్యం వహించదు. ఒక దేశ ప్రయోజనాలను నెరవేర్చేదిగా ఉండదు. స్పెక్యులేషన్ ద్వారా తక్షణ లాభాల లక్ష్యంతో పని చేస్తుంది. ఈ పెట్టుబడి త్వరగా లాభాలు సంపాదించటానికి అనేక విధాల ప్రయత్నిస్తుంది. ఫైనాన్స్ పెట్టుబడికి ప్రపంచీకరణ అనేది ఒకవైపు పెట్టుబడి కేంద్రీకరణపై ఆధారపడుతూనే ప్రపంచీకరించబడుతుంది. ప్రస్తుత పెట్టుబడి ప్రపంచీకరణ మూడవ ప్రపంచ దేశాలను పెట్టుబడికి స్వేచ్ఛా విహార భూమిగా మార్చటమనేది చాలా ముఖ్యమైన విషయం. అతి విలువైన సహజ వనరులను, పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు మొదలైన వాటిని కారు చౌకగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వాలపై వత్తిడి చేస్తుంది. ఇవన్నీ ఫైనాన్స్ పెట్టుబడి అదుపులోకి లాగబడతాయి. సరళీకరణ, ప్రపంచీకరణ అంటే ప్రపంచంలో పెట్టుబడి కేంద్రీకరణను మరింతగా ముందుకు తీసుకునిపోయే వ్యూహమే.

మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు తెచ్చేందుకు పాలక ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. వచ్చిన పెట్టుబడులన్నీ ఫైనాన్స్ పెట్టుబడుల రూపంలో రావటం వలన తిరిగి అవి ఎప్పుడు వైదొలుగుతాయో తెలియదు. అప్పటి దాకా విదేశీ ఫైనాన్స్ పెట్టుబడి మన దేశంపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంటుంది. దాని ప్రయోజనాలను పాలక ప్రభుత్వాలు కాపాడుతూనే ఉంటాయి. అందులో భాగమే ప్రభుత్వరంగ సంస్థలన్ననింటినీ అమ్మి వేస్తానని మోడీ ప్రభుత్వం ప్రకటించటం. విదేశీ ఫైనాన్స్ పెట్టుబడిదార్లకు సత్వరమే ఎక్కువ లాభాలు సమకూర్చిపెట్టడం కోసం పేదలకు, రైతులకు ఇస్తున్న రాయితీలు ఎత్తివేయటం, తగ్గించటం. మోడీ ప్రభుత్వం తగ్గించనున్న ఆహార, ఎరువుల సబ్సిడీ అందు లో భాగమే. క్రమక్రమంగా సబ్సిడీని తగ్గించి పూర్తిగా ఎత్తి వేస్తుంది. ఇలా తగ్గించిన మొత్తాన్ని దేశ, విదేశీ పెట్టుబడిదారులకు రాయితీల రూపంలో మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, వారి రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయి.

అమెరికాలో ఆహార, ఎరువుల సబ్సిడీలు ప్రభుత్వానికి భారంగా ఉందని చెబుతున్న మోడీ ప్రభుత్వం, బడా పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ప్రకటించటమే కాకుండా 2014- 15 నుంచి 2020 సంవత్సరాల్లో బడా పారిశ్రామికవేత్తల మొండి బకాయిలు 18,28,584 కోట్ల రూపాయలు కాగా, అందులో 6,83,388 కోట్ల రూపాయలను ఇప్పటికే బ్యాంకులు రద్దు చేయటం గమనిస్తే పాలకులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో వెల్లడవుతుంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష కోట్లకు పైగా పారు బాకీలు రద్దు చేయటం జరిగింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి బకాయిలు 21% పెరిగాయి. పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున అప్పులు రద్దు చేస్తున్న మోడీ ప్రభుత్వం, రైతులకు ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని మోడీ ప్రభుత్వం భారంగా భావించటం దాని రైతాంగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, ఆహార, ఎరువుల సబ్సిడీని తగ్గించే ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ, ఇప్పుడిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని రెట్టింపు చేయాలని యావన్మంది ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News