Monday, December 23, 2024

న్యూస్‌ పేపర్లలో ప్యాక్ చేసిన ఆహారం తింటే ప్రమాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సాధారణంగా రోడ్ల పక్కన బళ్ల మీద తినుబండారాలను, స్నాక్స్‌ను అమ్మేవారు న్యూస్ పేపర్ల లోనే ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. పైగా వేడివేడి బజ్జీలు, వడలు వంటివి కూడా న్యూస్ పేపర్ల లోనే ప్యాక్ చేసి ఇస్తుంటే , వాటిని తింటే చాలా ప్రమాదమని ఫుడ్ సేఫ్టీ, అండ్ స్టాండర్డ్ ్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) హెచ్చరించింది. దీనివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ హెచ్చరించింది. వార్తా పత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడం, భద్రపర్చడం ఆరోగ్యానికి మంచిది కాదని, పేపర్లలో వాడే ప్రింటింగ్ ఇంక్‌లో సీసం, భారీ లోహాలతోపాటు రసాయనాలు ఉంటాయని, అవి ఆహార పదార్ధాలతోపాటు శరీరం లోకి సులువుగా వెళ్తాయని, ఆహారం కలుషితమై తీవ్ర అనారోగ్య సమస్యలు దాపురిస్తాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ హెచ్చరించింది. అలాగే నూనెలో వేయించిన ఆహార పదార్ధాలకు నూనె పీల్చేందుకు పేపర్లను వినియోగించే అలవాటు మానుకోవాలని హెచ్చరించింది.

ఈ పరిస్థితుల దృష్టా ఆహారం ప్యాకింగ్‌కు, భద్రపర్చడానికి న్యూస్‌పేపర్లను వినియోగించే అలవాటును తక్షణం మానుకోవాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధనరావు దేశం లోని వినియోగదారులను అభ్యర్థించారు. న్యూస్‌పేపర్లను ఇంటింటికీ డెలివరీ చేసే సమయంలో వివిధ ప్రాంతాలకు పేపర్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో అవి రకరకాల పర్యావరణ పరిస్థితులకు లోనవుతుంటాయి. వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆహార భద్రత, ప్రమాణాలు అంటే ప్యాకింగ్ వంటి నిబంధనల ప్రకారం నిల్వ చేయడానికి గానీ, ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి గానీ న్యూస్‌పేపర్లు లేదా ఇతర ప్రింటింగ్ పేపర్లు గానీ వినియోగించవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ హెచ్చరించింది. ఈ తినుబండారాల వ్యాపార్లు, సరఫరాదారులు వినియోగదారుల ఆరోగ్యం గురించి బాధ్యత వహించాలని కమల వర్ధన రావు సూచించారు. ప్యాకింగ్ విషయంలో ఆరోగ్యానికి భద్రత కలిగించే సురక్షితమైన ప్రత్యామ్నాయ పద్ధతులు ఫుడ్‌గ్రేడ్ కంటైనర్లు వంటివి వినియోగించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News