బెంగళూరు: భారత ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు షాహిద్ హకీమ్ (82) గుండెపోటుతో కన్ను మూశారు. కర్నాటకలోని గుల్బర్గాలో ఓ ప్రైవేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. షాహిద్ హకీమ్కు భార్య, ఇద్దరు కుమార్తులు ఉన్నారు.1950 60 మధ్య కాలంలో హకీమ్ భారత్ తరఫున ఫుట్బాల్ మ్యాచ్లు ఆడారు. 1960 రోమ్ ఒలింపిక్స్లో భారత్ తరఫున షాహిద్ హకీమ్ ప్రాతినిధ్యం వహించారు. ఫిఫా మ్యాచ్లకు రిఫరీగా కూడా వ్యవహరించారు. ఆయన తండ్రి ఎస్ఎ కరీమ్ ప్రముఖ ఫుట్బాల్ కోచ్.
గత ఏడాది కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకున్నారు. గత వారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన సన్మానంలో భాగంగా ఆయనను కూడా సన్మానించారు. 2017లో హకీమ్ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో చీఫ్ ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా పని చేశారు. హకీమ్ హైదరాబాద్ సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ తరఫున కూడా ఆడారు. హకీమ్ మృతిపట్ల అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) సంతాపం ప్రకటించింది. మాజీ భారత ఫుట్బాల్ కెప్టెన్లు విక్టర్ అమల్రాజ్, షబీర్ అలీ, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జిపి పల్గుణ తదితరులు హకీమ్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు.