Tuesday, September 17, 2024

సాకర్ మ్యాచ్‌కు పోటెత్తిన అభిమానులు

- Advertisement -
- Advertisement -

Football match between thousands of fans in Vietnam

 

హనోయి: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో పెద్ద పెద్ద క్రీడలను వాయిదా వేయడమే లేకుంటే రద్దు చేయడమో జరిగింది. జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఇక, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఏకంగా రద్దు చేశారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన టోర్నీగా పేరున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. అమెరికా, ఆసియా, యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మరి దెబ్బకు ఇప్పటికే లక్షలాది మంది మృత్యు వాత పడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. చాలా దేశాల్లో జరగాల్సిన ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడలను రద్దు చేశారు.

కాగా, కరోనా నుంచి కోలుకున్న కొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే క్రీడలు నిర్వహిస్తున్నారు. జర్మనీ, ఇంగ్లండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఫుట్‌బాల్, టెన్నిస్ తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే ఆసియాలోని వియత్నాంలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా లేక పోవడంతో అక్కడ లాక్‌డౌన్ వంటి కఠిన నిబంధనలు అమల్లో లేవు. అయినా కరోనా భయంతో ఆ దేశంలో కూడా కొన్ని ఆంక్షలను విధించారు. ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో వియత్నాంలో వేలాది మంది అభిమానులు మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వియత్నాంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌కు ఏకంగా 30 వేల మంది అభిమానులు హాజరయ్యారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఎలాంటి భౌతిక దూరాన్ని పాటించలేదు. అంతేగాక అధికారులు కూడా స్టేడియంలో భౌతిక దూరం పాటించేలా ఎలాంటి మార్కింగ్‌లు చేయలేదు. దీంతో పాటు చాలా మంది అభిమానులు మాస్క్‌లు కూడా పెట్టుకోలేదు. కాగా, ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరైన అభిమానుల్లో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. మరోవైపు వియత్నాం స్ఫూర్తితో మరికొన్ని దేశాలు కూడా పరిమిత సంఖ్యలో అభిమానులతో ఫుట్‌బాల్ తదితర మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News