Thursday, January 23, 2025

మూడేళ్లలోపు రిటైర్ అయ్యే టీచర్లకు బదిలీ నుంచి మినహాయింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో 3 సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. 50 సంవత్సరాల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉండాలని, బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 ఏళ్లు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన జిల్లా విద్యాధికారుల సమావేశంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఉన్నతాధికారులు సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో బదిలీలు, పదోన్నతులపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి బదిలీల్లో ఎస్‌ఎస్‌సి పెర్ఫార్మెన్స్ పాయింట్స్, సర్వీస్ పాయింట్లు తొలగించారు.

17 శాతం,13 శాతం,11 శాతం హెచ్‌ఆర్‌ఎ ప్రకారం కేటగిరీ 1,2,3గా వర్గీకరణ పాయింట్స్ ప్రతి సంవత్సరానికి వరుసగా 1,2,3 పాయింట్లు కేటాయించనున్నారు. ఇదివరకు ఉన్న నాలుగవ కేటగిరీని తొలగించారు. స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపు వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆన్‌డ్యూటీ(ఒడి) ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్స్ ఇవ్వనున్నారు. బదిలీలకి ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించారు.

యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కటాఫ్ తేదీ నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన టీచర్లు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్‌సిసి ఆఫీసర్స్‌కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.

ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు

ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తారు.ప్రాధాన్యత కేటగిరీలో 70 శాతం వైకల్యం కలిగిన వికలాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు,ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయుల లేదా వారి జీవిత భాగస్వామి (స్పౌజ్) క్యాన్సర్, బోన్ టిబి, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతో పాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డైయాలసిస్‌కు అనుమతి ఇస్తారు. జువనైల్ డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీగా అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకునే వారు ఈ ఏడాది జనవరి 1 తర్వాత ఉన్న తేదీలలో జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన నుండి సర్టిఫికెట్ జత చేయాలి.ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే స్పెషల్ కేటగిరీ పాయింట్స్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి.ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ వర్తిస్తాయి.

జెడి స్థాయి అధికారి ఛైర్మన్‌గా కమిటీ

మల్టీజోన్ స్థాయిలో డియస్‌ఇచే నామినేట్ చేయబడిన జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారి చైర్మన్‌గా,ఆర్‌జెడి సెక్రటరీగా, సంబంధిత డిఇఒ సభ్యునిగా కౌన్సెలింగ్ కమిటీ ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జెడ్‌పి సిఇఒ సభ్యునిగా, డిఇఒ సెక్రటరీగా కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో జెడ్‌పి, ఎంపి టీచర్లకు జెడ్‌పి చైర్పర్సన్ చైర్మన్‌గా, కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ సిఇఒగా సభ్యులుగా, డిఇఒ కార్యదర్శిగా కమిటీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జిటిలకు డిఇఒ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఆర్‌జెడి బదిలీ అధికారిగా ఉంటారు. ట్రాన్సఫర్ ఆర్డర్ పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ ఈ విద్యా సంవత్సరం (2022 -23) చివరి పనిదినం రోజు మాత్రమే పాత స్కూల్ నుండి విడుదల కావాలి.

ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అధికారిక ఉత్తర్వులు, షెడ్యూల్ వెలువడనుంది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించగా, తాజాగా టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News