భర్తపై ఛత్తీస్‌గఢ్ మహిళ ఫిర్యాదు
దుర్గ్(ఛత్తీస్‌గఢ్): పెళ్లి చేసుకునేందుకు తన భర్త తనను బలవంతంగా మత మార్పిడి చేయించాడని, తనతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఒక 21 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం కోసం తన భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త, అత్తమామలు, భర్త సోదరుడు, సోదరుడి భార్యపై బుధవారం ఛావ్నీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ విశాల్ సోన్ తెలిపారు. ఆ మహిళ భర్తను, మామను, మరిదిని అరెస్టు చేశామని, అతని తల్లి, మరదలు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. దుర్గ్ జిల్లాలోని జెఎపి నగర్ నగర్‌కు చెందిన ఆ మహిళ అదే ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాల యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరూ గత సంవత్సరం డిసెంబర్లో ఎవరికీ చెప్పకుండా పరారయ్యారు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ జంట తిరిగివచ్చి తాము కోల్‌కతాలో పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలతో సహా ఛావ్నీ పోలీసులకు తెలియచేశారు. అప్పటి నుంచి వారు ఆమె భర్త ఇంట్లో ఉంటున్నారు. అయితే..హఠాత్తుగా బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆ మహిళ తన భర్తపై ఫిర్యాదుచేసింది.