కిషన్‌రెడ్డికి సిక్కుల ప్రతినిధిబృందం ఫిర్యాదు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరుకు చెందిన సిక్కుల ప్రతినిధి బృందం మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డిని ఢిల్లీలో కలుసుకుని కశ్మీరులో సిక్కు మతానికి చెందిన బాలికలను బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన బిజెపి నాయకుడు ఆర్‌పి సింగ్ కూడా ప్రతినిధి బృందంలో ఉన్నారు. కశ్మీరులో సిక్కు బాలికలను బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సిక్కుల ప్రతినిధి బృందం తనకు ఒక వినతిపత్రాన్ని అందచేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవలే కశ్మీరులో నలుగురు సిక్కు యువతులను బలవంతంగా పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మార్పించారని శిరోమణి అకాలీ దళ్ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా సోమవారం ఆరోపించారు. ఆ యువతులను వారి కుటుంబాలకు తిరిగి రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నలుగురు యువతులలో ఒక యువతి తన కుటుంబాన్ని తిరిగి చేరుకుందని, ఆమెకు సిక్కుమతానికి చెందిన వ్యక్తితో మంగళవారం వివాహం జరిగినట్లు ఢిల్లీ ఎస్‌ఎడి అధ్యక్షుడు పరంజిత్ సింగ్ శ్రీనగర్‌లో విలేకరులకు తెలిపారు.