న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయానాలపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఆగస్టు 31వరకూపొడిగించింది. కరోనా , థర్డ్‌వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ మేరకు పౌర విమానయాన అధీకృత సంస్థ (డిజిసిఎ) శుక్రవారం ప్రకటన వెలువరించింది. గత ఏడాది మార్చి 23 నుంచి సాధారణ స్థాయి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం ఉంది. కోవిడ్ సంక్షోభంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు ప్రత్యేక పరిస్థితులలో అనుమతి ఉంది. ఇంతకు ముందటి ఉత్తర్వుల మేరకు ఈ నెల 31వ తేదీతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితి, ప్రత్యేకించి డెల్టా వేరియంట్ల తీవ్రత నేపథ్యంలో నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని డిజిసిఎ తాజా సర్కులర్‌లో తెలిపింది.
అమెరికా ఆంక్షలు కొనసాగింపు?
ఇతరదేశాల నుంచి అమెరికాకు విమాన రాకపోకలపై ఇప్పుడున్న ఆంక్షలు ఇక ముందు కూడా కొనసాగుతాయి. ఇటీవలి కాలంలో దేశంలో డెల్టా వేరియంట్ల విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల కొనసాగింపునకే బైడెన్ అధికార యంత్రాంగం మొగ్గుచూపింది. అత్యవసర స్థితి, ఉన్నతస్థాయి అనుమతులు తప్పితే దాదాపుగా ఏడాదిగా ఇండియా నుంచి అమెరికాకు విమానాల రాకపోకలు నిలిచిపొయ్యాయి.