Monday, December 23, 2024

ఇంటర్న్‌షిప్: విస్తృతావకాశాలు

- Advertisement -
- Advertisement -

‘Companies are increasingly bypassing the spring job market, when they typically interviewed college seniors, and instead are hiring directly from their intern pools, offering jobs and forcing students to commit just weeks into their senior year. More than 70 percent to 80 percent of new hires at big companies like Facebook, Enterprise Rent-a-Car, and eBay come through their internship programs now, compared to about half or just a decade ago’ Washington Post

ప్రస్తుతం డిగ్రీ ఉత్తీర్ణులలో నలభై నుండి యాభై శాతం మందికి ‘ఎ’ గ్రేడే కనిపిస్తుంది. గతంతో పోల్చి చూస్తే గ్రేడు ప్రదానంలో కావొచ్చు లేదా సాధనలో కావొచ్చు అకడమిక్స్ పరంగా పట్టభద్రుల్లో ఇదొక గణనీయమైన ప్రగతి. కేవలం డిగ్రీతోనే సరిపెట్టుకోకుండగా అడ్వానస్డ్ డిగ్రీలైన పి.జి, పిహెచ్.డిల పైనా విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. కెరీర్‌లో సిజిపిఎతో పాటు ర్యాంక్ కీలకం కావటాన ఎవరైతే ఉత్తమ గ్రేడ్లు పొంది వున్నారో వాళ్లంతా మేం చాలా శ్రమించి మంచి గ్రేడు, టాప్ ర్యాంకు సాధించాం. మాకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది, కంపెనీలు తప్పకుండా ఇవ్వాల్సిందేనని’ అర్హతా గరిమ (Sense of entitlement)’ ను ప్రకటించే వైనం మనం ఎరుగుదుము. మంచి గ్రేడు, మంచి ర్యాంకు తెచ్చుకున్న యోగ్యులు (Meritorious)కు ఆ మాత్రం భావాధిక్యం వుండటంలో ఎంత మాత్రం తప్పులేదు.

కానీ, కంపెనీలు, ఆయా సంస్థలు మెరిట్‌ను మాత్రమే చూసి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఒకప్పటిది. ఇప్పుడు యాజమాన్యాలు మెరిట్‌తో పాటు అనుభవానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే అభ్యర్థుల ‘Resume’ లో వ్యక్తిగత వివరాలు, లక్ష్యాలు, విద్యార్హతలు, అదనపు అర్హతలు-, సర్టిఫికెట్లు- అవార్డులు, ప్రతిభ, నైపుణ్యాలు, భాషల ప్రావీణ్యం, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్, రెఫరెన్సులతో పాటు ‘internship’ అనే కొత్త అంశం వచ్చి చేరింది. ఇంటర్న్‌షిప్ అంటే శిక్షణలో మలిదశ, పనిలో అనుభవం గడించే కాలం. ‘practicum’ అని కూడా అంటారు. తరగతిలో అబ్బేది థిరీటికల్ నాలెడ్జ్. క్షేత్రస్థాయిలో అనుభవం గడించడానికి పనికొచ్చేది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంటర్న్‌షిప్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. కోర్సు ముగింపులో పది నుండి పదిహేను వారాల కాల పరిమితికి లోబడి విద్యార్థులు ఆయా పరిశ్రమలు లేదా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి వుంటుంది.

ఇంటర్న్‌షిప్ కెరీర్ గురించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆసక్తులకు సంబంధించి మరిన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, కోర్సుకు లోపల వెలుపల అవకాశాలను వివిధ విభాగాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది, సహాయపడుతుంది. అయితే, ఇంటర్న్‌షిప్ అనేది కెరీర్ అభివృద్ధికి ఉత్తమమైన మార్గం అని తెలిసినప్పటికినీ, విద్యార్థులు కొందరు అది తమ శ్రమకు తగినది కాదని అంతగా పట్టించుకోరు. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఇంటర్న్‌షిప్ లేదా ప్రాక్టీకమ్ కంటే ముఖ్యమైనది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కాలేజీలు, శిక్షణా సంస్థలు నిర్దేశించిన సమయంలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుంటే ఆచరణాత్మక నైపుణ్యాలతో వాస్తవ పని స్థలంలోనికి సుసంపన్నంగా ప్రవేశించవచ్చు.
తాము ప్రవేశించాలనుకునే ఫీల్డ్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగానికి కనీసం ఒక సంవత్సరం అనుభవం కనుక అవసరమైతే ఈ అనుభవంతో పాటు ఉద్యోగం పొందేందుకు విద్యార్థులు ఒక సంవత్సరం పాటు ఉండే ఇంటర్న్‌షిప్ కలిగి వుండడం ఉత్తమం.

కంపెనీలు జాబ్ నోటిఫికేషన్‌లో షార్ట్/ లాంగ్ టర్మ్ అంటూ కాలపరిమితిని ప్రత్యేకంగా పేర్కొంటున్నాయి. అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఇంటర్న్‌షిప్ ఎంపిక చేసుకోవాలి. కాలేజీ ఇచ్చే క్రెడిట్ కోసం లేదా రెజ్యూమ్‌లో పేర్కొనడానికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి వుంటే యధారీతి చేసుకోవచ్చు. తక్కువ ఇంటర్న్‌షిప్‌ని ‘ఎక్స్‌టర్న్‌షిప్’ అంటారు. సాధారణంగా ఇది రెండు రోజుల నుండి రెండు వారాల స్వల్పనిడివి వుంటుంది. ‘జాబ్ షాడోయింగ్’ అంటే కూడా ఇదే. ఇంటర్న్‌షిప్‌లలో దేని ప్రయోజనాలు దానికి వున్నప్పటికీ, దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌కే రెజ్యూమ్‌లో ఎక్కువ గుర్తింపు. స్థానిక కంపెనీలు మొదలుకొని గ్లోబల్ సంస్థల వరకు ఎక్కడైనా ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. వీలుంటే విదేశాల్లో ఇంటర్న్‌షిప్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఖర్చుతో కూడుకున్నవి. అయితే, ఇంటర్న్‌షిప్ రకాన్ని బట్టి ఆయా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, అలుమ్నీలు, దేశవిదేశాల అకడమిక్ ఎక్చేంజ్ సర్వీసు ఏజన్సీలు,

పరపతి సంస్థలతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు కూడా ఫండింగ్ కూడా చేస్తుంటాయి. తన అబ్రాడ్ అనుభవాన్ని ప్రోది చేసి కూర్చిన ‘Intern Abroad This Summer’ అనే గ్రంథంలో ‘A foreign internship is a double win. It gives you invaluable experience that you can leverage on your resume in addition to traveling to foreign destinations and experiencing new cultures. Interning in a foreign country provided me with countless opportunities to increase my life skills’ అంటున్న ప్రముఖ ఎంట్రప్రెన్యుయర్, ఐఐటియన్ అకేత్ సింగ్ సలహాలు సూచనలు అనుసరణీయం. ఎందుకంటే, సక్సెస్ సాధించాలన్న కోరిక ఒక్కటే సక్సెస్ తెచ్చిపెట్టదు. సక్సెస్ బాటలో ఎన్నో ‘రోడ్ బ్లాక్స్’ వుంటాయి. వీటిని అధిగమించే నైపుణ్యాలను ఇంటర్న్‌షిప్ కల్పిస్తుంది. ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు కానీ, విద్యార్హతలు, సామర్థ్యాలు యోధుడికి భుజబలం అనుకుంటే, ఇంటర్న్‌షిప్ ఆయుధాల వంటిది అంటారు కెరీర్ నిపుణులు.

ఇంటర్న్‌షిప్ విద్యార్థులను పని వాతావరణంలో ఇమిడించి శిఖరానికి చేరుస్తుంది. కంపెనీ ఇంటర్న్‌గా ఉన్నకాలం ఆఫీసు వాతావరణంలో ఏయే విషయాలు ఎలా పని చేస్తాయో, ప్రభావం చూపుతాయో అనుభవంలోకి వస్తాయి. ఇంటర్న్ అనుభవమంతా ఫుల్ టైం ఉద్యోగిగా చేరినప్పుడు ఉద్యోగి కార్యనిర్వహణలో ఏ పాత్రను పోషించాలనే దానిపైన స్పష్టతను ఇస్తుంది. టైం మేనేజ్ మెంట్‌ను బోధిస్తుంది. విద్యార్థి జీవితంలో ఒక సంస్థలో ఇంటర్న్ పోషించే నిర్ణయాత్మక పాత్రను గురించిన పరిశోధనలు రిపోర్టులు మనకు చాలినన్ని వున్నాయి. ‘స్టేట్ ఆఫ్ మిలీనియల్ హైరింగ్ రిపోర్ట్ (ఎస్‌ఎంహెచ్ ఆర్)’ ప్రకారం మూడు కంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేసిన అమెరికా గ్రాడ్యుయేట్లు పూర్తి సమయపు ఉద్యోగాన్ని త్వరగా పొందే అవకాశం వుంది. అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ ప్రాముఖ్యతను కూడా లోతుగా అర్థం చేసుకుంటున్నారని, 80 శాతానికి పైన గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ చేయడం వలన కెరీర్ అవకాశాలు గణనీయంగా మెరుగైనాయనీ ఎస్‌ఎంహెచ్‌ఆర్ తెలుపుతుంది. బ్రిటన్ లో ‘సుట్టన్ ట్రస్ట్ రిపోర్ట్- 2018ను చూస్తే,

ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన మధ్యతరగతి, శ్రామిక తరగతి విద్యార్థులకు కంపెనీలు అధిక జీతాలు ఇస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్ కెరీర్ నెట్ వర్కింగ్‌కు మద్దతునిస్తుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో విద్యార్థులు అనేక సమావేశాలకు, ఈవెంట్‌లకు హాజరయ్యే అవకాశం వుంటుంది. మంచి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు అనేక మందిని కలుసుకోవచ్చు. ఇందువల్ల కొత్త పారిశ్రామిక, వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ ఈవెంట్లలో భవిష్యత్ యజమానిని కూడా విద్యార్థులు కలుసుకోవచ్చు. Study.eu వ్యవస్థాపకుడు, సిఇఒ, ప్రముఖ కెరీర్ మెంటర్ గెరిట్ బ్రూనో బ్లాస్ తను గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సెమిస్టర్ విరామాలలో తొమ్మిది ఇంటర్న్‌షిప్‌లు చేశాడు. వీటిలో మూడు ఇంటర్న్‌షిప్‌లు ఈయన్ను జర్మనీ నుండి ఇటలీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఇండియాకు నడిపించాయి.ఈ సందర్భంలో ఇంటర్న్‌షిప్‌లు తనకు 1. పని అనుభవం (work experience ), 2. అంతర్ సంస్కృతి నైపుణ్యాలు (inter cultural skills),

3. గ్లోబల్ నెట్‌వర్కింగ్ (global networking), 4. వ్యక్తిగత వృద్ధి (personal growth), 5. ప్రపంచ వీక్షణం (seeing world) లాంటి ఐదు కీలకమైన అభ్యసనాంశాల్లో లబ్ధిచేకూర్చాయంటారు బ్రూనో బ్లాస్. అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌ల నుండి రిమోట్ లేదా వర్చువల్ ఇంటర్న్‌షిప్‌ల వరకు జీతం లేదా స్టైఫండ్ చెల్లించే ఇంటర్న్‌షిప్‌లు, ఎటువంటి చెల్లింపులు లేని ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. 1. వ్యాపారం & నిర్వహణ, 2. హెల్త్‌కేర్ & మెడికల్, 3. జర్నలిజం & మీడియా కమ్యూనికేషన్స్, 4. రాజకీయాలు & అంతర్జాతీయ అధ్యయనాలు, 5. వెటర్నరీ & యానిమల్ సైన్స్, 6. ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్, 7. సైకాలజీ & థెరపీ, 8. మార్కెటింగ్, 9. క్రీడలు, 10. ఫైన్ ఆర్ట్ విభాగాల్లోనే కాకుండా ఇతరత్రా సబ్జెక్టులలో కూడా అంశకాలిక (part-time), పూర్తిక కాలిక (full-time) ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో వున్నాయి. ఇంటర్న్‌షిప్ దరఖాస్తు చేస్తున్నప్పుడు సంబంధిత పరిశ్రమ మీ కెరీర్ లక్ష్యాలకు సరిపోతుందో లేదో నిర్ధారించుకోవాలి. ఇంటర్న్‌షిప్ కల్పిస్తున్న సంస్థలకు గుర్తింపు అకడమిక్ వాలిడిటీ వుందో లేదో చూసుకోవాలి. అన్నిటికి జీతం, ఉపకార వేతనాలుండవు. కొన్ని కళాశాలలు క్రెడిట్‌ను మాత్రమే అందిస్తాయి.

క్రెడిట్ కోసం ఎంచుకుంటే అది బదిలీ అవుతుందో లేదో కాలేజీతో మాట్లాడి షెడ్యూల్‌తో పాటు అన్ని విషయాలను ధ్రువీకరించుకోవాలి. ప్రోగ్రామ్ నిడివి, బాధ్యతలు, పని గంటలు, చెల్లింపులు, క్రెడిట్లు, నైపుణ్యాల అంచనా తదితర వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాల్సి వుంటుంది. అభ్యాస రీత్యా ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి అభ్యర్థి కొన్ని హెచ్చుతగ్గులు చవిచూడాల్సి వుంటుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతిదీ ప్రశ్నింపబడే సందర్భాలూ వుంటాయి. ప్రపంచంలోనే తమదే అగ్రస్థానమనే భావనకూ చోటు వుంటుంది. ఏదేమైనా ఇంటర్న్‌షిప్ నుండి స్ఫూర్తిని పొందడమే ముఖ్యం. కొత్త విషయాలను నేర్చుకోవడం, లేదంటే తమ ఆలోచనలు భావధారను మేనేజర్‌లతో పంచుకునే వీలు ఉండడం మూలాన శిక్షణలో సహాయకారిగానైనా స్ఫూర్తి ప్రదాతగానైనా ఇంటర్న్‌షిప్ నిలువగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News