Wednesday, January 22, 2025

ఎల్‌ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -
Foreign Investment in LIC IPO
20 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్‌ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంస్థలోకి నేరుగా 20 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించాలని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్‌ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం .. ఎల్‌ఐసి ఐపిఓలో పాల్గొనేందుకు విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డిఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్‌ఐసికి వర్తించదు. పార్లమెంటులో చట్టం చేసి ఓ ప్రత్యేక సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. దీంతో ఎల్‌ఐసి చట్ట సవరణ ద్వారా ఎఫ్‌డిఐలకు వీలు కల్పించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఇప్పుడు ఎల్‌ఐసిలోకి ఎఫ్‌డిఐలను అనుమతించడంతో అతిపెద్ద విదేశీ పెన్షన్ ఫండ్స్,బీమా సంస్థలు దేశంలోనే అతిపెద్ద ఐపిఓగా భావిస్తున్న ఎల్‌ఐసి పబ్లిక్ ఇష్యూలో పాల్గొనే వీలుంటుంది.తద్వారా వాటా విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్)లో భాగంగా విదేశీ పెట్టుబడులకు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖనుంచి అభిప్రాయ సేకరణ ద్వారా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం ఐపిఓల ద్వారానే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) ఎఫ్‌డిఐలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎఫ్‌డిఐ విధానానికి స్వల్ప సవరణలు తీసుకు వచ్చినట్లు ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారు. సులభంగా ఎఫ్‌డిఐ ఫ్రేమ్‌వర్క్‌ను అర్థం చేసుకునేలా నిబంధనలను సవరించినట్లు తెలిపారు.

ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు ఎఫ్‌డిఐ పాలసీలో సంస్కరణలు తోడ్పాటునిస్తాయన్నారు. తద్వారా భారీగా ఎఫ్‌డిఐ నిధుల రాకతో పెట్టుబడులు, ఆదాయాలు, ఉద్యోగాల్లో వృద్ధి నమోదవుతునందని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డిఐ పాలసీ ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించారు. ఇతర కార్పొరేట్ సంస్థల మాదిరిగానే ఎల్‌ఐసిలో కూడా 20 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించాని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐపిఓ ద్వారా 5శాతం వాటాల విక్రయానికి అనుమతించాలని ఈ నెల 13న ఎల్‌ఐసి సెబీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఐపిఓ ద్వారా రూ.63,000 వేల కోట్ల నిధులను సేకరించాలనేది ప్రభుత్వ లక్షం. మార్చి లోగా ఈ ఐపిఓ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News