Saturday, January 11, 2025

మేలో రూ.43,838 కోట్ల విదేశీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

9 నెలల గరిష్ఠానికి చేరిన ఎఫ్‌పిఐ ఇన్వెస్ట్‌మెంట్స్, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడమే కారణం

ముంబై : భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత నెలలో(మే) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) దాదాపు రూ.43,838 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడం, స్టాక్స్ విలువ దిగిరావడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడులకు దోహదం చేశాయి. జూన్ నెలలోనూ ఎప్‌పిఐల కొనుగోళ్లు కొనసాగనున్నాయి. ఎందుకంటే ఈ నెలలో కేవలం రెండు రోజుల్లోనే రూ.6,490 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ, తాజా జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) గణాంకాలు, హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందనే సంకేతాలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రస్తుత నెలలో ఎఫ్‌పిఐ పెట్టుబడుల ప్రవాహం కొనసాగనుందని ఆయన అన్నారు. డేటా ప్రకారం, మే నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో దాదాపు రూ.43,838 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తొమ్మిది నెలల్లో ఎఫ్‌పిఐ పెట్టుబడులు ఈ స్థాయిలో రావడం ఇప్పుడే, ఇంతకుముందు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ.51,204 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌లో రూ.11,630 కోట్లు, మార్చి నెలలో రూ.7,936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

మార్చిలో అదానీ గ్రూప్‌లో జిసిక్యూ పెట్టుబడులు

మార్చిలో ముఖ్యంగా అమెరికాకు చెందిన జిక్యూజి పాట్నర్స్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. అదానీ గ్రూప్‌లో జిసిక్యూ పెట్టుబడులకు సర్దుబాటు చేస్తే, నికర ప్రవాహం మాత్రం ప్రతికూలంగా ఉంది. మరోవైపు ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఎఫ్‌పిఐలు దాదాపు రూ.34 వేల కోట్ల పెట్టుబడును ఉపసంహరించుకున్నారు. మార్నింగ్ స్టాక్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసొసియేట్ డైరెక్టర్ హిమానన్షు శ్రీవాత్సవ మాట్లాడుతూ, తాజా నికర పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి కారణం భారత్ స్థూల గణాంకాలు మెరుగ్గా ఉండడమేనని అన్నారు. మరోవైపు స్టాక్‌ల విలువ ఆకర్షణగా ఉండడం, క్యూ4 ఫలితాలు బాగుండడం సానుకూల దృక్పథాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.

భారత్‌లో కొనుగోళ్లు, చైనా విక్రయాలు

ఆసక్తికరమైన విషయమేమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. చైనాలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా ఉన్నారు. రంగాల వారీగా చూస్తే, ఫైనాన్షియల్, ఆటోమొబైల్, టెలికామ్, కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మేలో డెబిట్ మార్కెట్‌లో ఎఫ్‌పిఐల పెట్టుబడులు రూ.3,276 కోట్లుగా ఉన్నాయి. 2023లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల్లో రూ.35,748 కోట్లు, డెబిట్ మార్కెట్లో రూ.7,471 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News