హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల అనంతరం వైన్‌షాపులకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో విదేశీ మద్యం (ఫారెన్ స్కాచ్) అమ్మకాలు సుమారు పది నుంచి 20 శాతం పెరిగినట్లు ఆబ్కారీశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 2020లో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 90 కేసుల విదేశీ మద్యం అమ్మకాలు జరగ్గా, ఇదే సంవత్సరం అక్టోబర్ నెలలో 110 కేసులు అమ్ముడుపోయింది. ఇదే సంవత్సరం నవంబర్ నెలలో ఏకంగా 122 కేసుల విదేశీ మద్యం అమ్ముడుపోగా, డిసెంబర్ నెలలో 135 కేసులు అమ్ముడుపోయినట్టుగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాల్లో మాత్రమే విదేశీమద్యానికి అంత గిరాకీ ఉండదని ఆబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు. మాములుగా గ్రేటర్ పరిధిలో విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా విదేశీ మద్యానికి అధికంగా అమ్ముడవుతున్నట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కంటే హైదరాబాద్‌లో విదేశీమద్యం అధికంగా అమ్ముడవుతున్నట్టుగా ఆబ్కారీ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
సుమారు 30 విదేశీ బ్రాండ్ల అమ్మకాలు
గతంలో ఒకటి, రెండు మద్యం షాపుల నుంచి మాత్రమే ఫారెన్ లిక్కర్ కావాలని ఆర్డర్ వచ్చేదని, అది కూడా ప్రతి నెలా ఉండేది కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రతి నెలా ఈ ఫారెన్ లిక్కర్ ఇండెంట్ ఉంటోందని అధికారులు తెలిపారు. ఈ ఫారెన్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని, సుమారు 30 విదేశీ బ్రాండ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని డిపో అధికారులు పేర్కొంటున్నారు. మాములుగా 50కి పైగా విదేశీ మద్యంలో రకాలు ఉంటాయని అందులో సగానికి పైగా బ్రాండ్లకు మాత్రమే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దేశీయ మద్యం కంపెనీలే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని దిగుమతి చేసుకుని ఐఎంఎల్ డిపోలకు సరఫరా చేస్తున్నాయని ఆబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు.
విదేశాలకు వెళ్లిన వారు తీసుకొచ్చేవారు….
ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే సమయంలో అక్కడి నుంచి ఒకటి, రెండు విదేశీ మద్యాన్ని తీసుకొచ్చేవారు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మాత్రమే గతంలో ఫారెన్ ‘సరుకు’ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ విదేశీ బ్రాండ్లన్నీ గ్రేటర్ పరిధిలోని మద్యం షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఫారెన్ స్కాచ్ తాగడానికి వినియోగదారులు ఇష్టపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.