తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ
భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి విదేశీ పర్యాటకులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2020 మార్చిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటినుంచి పర్యాటకం, ఆతిథ్య, విమానయాన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ రంగాలు తిరిగి పుంజుకునేలా చేయడం కోసం విదేశీ పర్యాటకులను భారత్ సందర్శించడానికి అనుమతించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా అయిదు లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా వీసాలను జారీ చేయాలని అనుకుంటోంది. దీనికి సంబంధించి ఈ రంగాలకు చెందిన భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నామని, విదేశీ పర్యాటకులకోసం దేశం తలుపులు తెరవడానికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెప్పారు. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 50 వేల లోపే నమోదవుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. తాజాగా శనివారం దేశంలో 30 వేల కేసులు మాత్రమే నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3.32 లక్షలకు తగ్గాయి.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. కాగా ఉచిత వీసాలను 2022 మార్చి దాకా లేదా, అయిదు లక్షల వీసాలు పూర్తయ్యేంత వరకు ఏది ముందయితే అంతవరకు జారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.100 కోట్ల భారం పడుతుంది. నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఇ టూరిస్టు వీసా చార్జి దాదాపు 25 డాలర్లు ఉండగా, ఏడాది పాటు అమలులో ఉండే మల్టిపుల్ ఎంట్రీ ఇ టూరిస్టు వీసా చార్జి 40 డాలర్ల వరకు ఉంది. 2020 మార్చిలో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించినప్పటినుంచి ఇ టూరిస్టు వీసాను నిలిపి వేశారు. కాగా కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న కేరళ లాంటి రాష్ట్రాలకు విదేశీ టూరిస్టులను అనుమతించాలా వద్దా అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయని హోంమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా విదేశీ టూరిస్టుల స్పందన, పరిణామాలను బేరీజు వేడం కోసం విదేశీ పర్యాటకులును అనుమతించడం దశలవారీగా ఉండవచ్చని మరో అధికారి చెప్పారు. యూరప్ దేశాలతో సహా చాలా దేశాలు ఇప్పటికే విదేశీ సర్యాటకులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే.