Saturday, November 23, 2024

విదేశీ వర్శిటీలు

- Advertisement -
- Advertisement -

నూతన విద్యా విధానం ఎంతటి ప్రమాదకరమైనదో విదేశీ విశ్వవిద్యాలయాలను భారత్‌లోకి ఆహ్వానిస్తూ మోడీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా పత్రం మరోసారి తేటతెల్లం చేసింది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ఫీజులు, అడ్మిషన్లపై నియంత్రణ ఎత్తివేస్తున్నాం అంటూ విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం (యుజిసి) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత విద్యను విదేశీ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు వాస్తవానికి 1990 నుంచే మొదలయ్యాయి. విదేశీ విశ్వవిద్యాలయాలను భారత్‌లోకి ఆహ్వానించేందుకు సంబంధించిన బిల్లు 1995లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన తొలిసారే విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కిపోయింది. 2005- 06 లోనూ ప్రయత్నాలు జరగ్గా కేబినెట్ దశలోనే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత యుపిఎ 2 అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నమే జరిగితే వామపక్షాలు తిప్పికొట్టాయి.

విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని అప్పట్లో బిజెపి కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఎర్రతివాచి పరిచి స్వాగతిస్తుండటం దాని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకొని ఫీజులు ప్రతిదీ మీ ఇష్టం మీరు ఎలా చెబితే అలా… అంటూ అపరిమిత స్వేచ్ఛ కల్పిస్తామంటోంది. అంతేకాదు ఇక్కడ ఆర్జించిన మొత్తాన్ని మొత్తం మీరు తీసుకెళ్లిపోవచ్చు అంటూ మోడీ సర్కార్ బంపర్ బోనాంజా ఆఫర్ ప్రకటించింది. ఇది దేశంలోని ఉన్నత విద్యను మొత్తం విదేశీ కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో పెట్టడం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక సంస్థలనే ఆహ్వానిస్తున్నామని ఇప్పుడు చెబుతున్నా వాస్తవంలో ఇక్కడి విద్యారంగాన్ని దండుకునేందుకు విదేశీ విద్యా సంస్థలు గద్దల్లా వాలిపోవడం ఖాయం. శస్త్రచికిత్సలకు, టెస్ట్‌ట్యూబ్ బేబీలకు, క్లోనింగ్ ఇలా ప్రతిదానికీ మనమే ఆద్యులమని, భారత్ విశ్వగురు అని ఇతిహాసాలను శాస్త్రీయ పరిణామాలుగా పేర్కొంటూ మూఢత్వాన్ని ప్రజల్లోకి చొప్పించే మోడీ సర్కార్… ఇప్పుడు అదే ‘విశ్వగురు’కు విదేశీ విశ్వవిద్యాలయాల అవసరమే మొచ్చిందో చెప్పాలి.

ఒకే దేశం… ఒకే కార్డు, ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను ఏకీకృత నియంత్రత్వంపై లాక్కెళ్తున్న మోడీ సర్కార్‌కు మరో వైపు లార్డ్ మెకాలే తరహాలో విదేశీ విద్యపై మమకారం పుట్టుకు రావడంలో ఆంతర్య మేమిటో! దేశ నిర్మాణంలో విద్య ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ చదువు వరకూ మన దేశంలో పరిస్థితులకు అనుగుణంగా సాగాల్సిందే. భారత్ లాంటి దేశాల్లో సాంఘిక శాస్త్రాలే కాకుండా జీవశాస్త్రం, ఇంజినీరింగ్ వంటి సైన్స్ చదువులు సైతం స్థానిక జీవన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, అప్పుడే ఫలితాలు దక్కుతాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త జెడి బెర్నాల్ విద్యా ప్రపంచీకరణ తొలినాళ్లలోనే సెలవిచ్చారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత పరిస్థితులకు పొసగవని విద్యారంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.

అటువంటి వైవిధ్యమైన పరిస్థితులున్న భారతావనిలో విదేశీ విద్యాసంస్థలకు ఎర్ర తివాచి పరిచి ఎటువంటి నియంత్రణలు లేకుండా ప్రవేశాల ప్రక్రియ, ఫీజులు వాటి ఇష్టానికి వదిలేస్తే దేశంలో ఉన్నత విద్యారంగం విదేశీ శక్తులపరం చేయడమే అవుతుంది. విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ మూడు లక్ష్యాలతో నూతన విద్యా విధానాన్ని మోడీ సర్కార్ బలవంతంగా రుద్దుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తెరపైకి విదేశీ విశ్వవిద్యాలయాలను తీసుకొస్తోంది. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి పరిశోధనలకు, అధ్యయనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు దులిపేసుకునేందుకే ఈ ‘విదేశీ విశ్వవిద్యాలయాలు’ పేరు తో పన్నాగానికి పాల్పడుతోంది. దేశంలోని చాలా సామాజిక తరగతులకు ఉన్నత విద్య ఇప్పటికీ ఎండమావిగానే ఉంటోంది. అణగారిన, ఆదివాసీ తరగతుల్లో ఇప్పుడిప్పుడే తొలి తరం విశ్వవిద్యాలయాల మెట్లు ఎక్కుతోంది. ఈ దశలో విద్య కార్పొరేటీకరణతో విదేశీ శక్తుల గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ వెళ్లిపోతే సామాన్యులకు ఉన్నత విద్య పగటి కలగా మిగిలిపోతోంది. ఇప్పటికే విద్యారంగంలో ఉన్న అసమానతలను మరింత పెంచే ఈ విధానాన్ని, దీనికి మూలమైన నూతన విద్యా విధానాన్ని ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News