Wednesday, January 22, 2025

వన్యప్రాణుల వేట నిరోధంపై అటవీశాఖ స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

వేటగాళ్లు వినియోగించే వలల స్వాధీనంకు చర్యలు

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణలో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. డిసెంబర్-1 నుంచి క్యాచ్ ద ట్రాప్ కార్యక్రమం పేరిట దీనిని చేపడుతోంది. వన్యప్రాణుల వేటను నిరోధించడంలో భాగంగా ముఖ్యంగా వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషం, పేలుడు పదార్థాలు మొదలైన వాటిని ఉపయోగించి అటవీ జంతువులను వేటాడటం , చంపడం నిషేధించారు. సాధారణంగా వైర్, నైలాన్ లేదా స్టీల్, మెష్, ఇతర పరికరాలు అటవీ జంతువుల వేటకు ఉపయోగిస్తారు. వ్యవసాయ పంటల నష్టాన్ని నివారించడం కోసం కొంతమంది, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారం కోసం కూడా ఇటువంటి జంతువుల వేట విరివిగా జరుగుతుంది. అటవీ జంతువుల దాడి కారణంగా పంట నష్టపోవటం, పెంపుడు పశువుల నష్టానికి ప్రతీకారంగా కూడా అటవీ జంతువుల వేట జరుగుతుంది.

ఈ క్రమంలో తాజాగా వన్యప్రాణులను చంపడం,వేటాడటం మొదలైన ప్రయత్నాలను నిరోధించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక (ఇంటెన్సివ్ ప్రివెంటివ్) డ్రైవ్‌ను ప్రారంభించింది. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్ లో వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించటం ద్వారా వేటగాళ్లను గుర్తించటం, వారు వాడే పరికరాలను స్వాధీనం చేసుకోవటం, గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేయటం చేస్తారు. అంతే కాకుండా వణ్యప్రాణుల వేటకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు అటవీ ప్రక్కనే ఉన్న గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

స్వాధీనం చేసుకున్న అన్ని వేటకు ఉపయోగించే మెటీరియల్, పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం తిరిగి ఉపయోగించడాన్ని నివారించటం కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేస్తారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ఇన్‌ఫార్మర్‌లను, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడానికి తగిన రివార్డులు వినియోగిస్తారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువులకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా వేట సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా ఫోన్ 9803338666, టోల్ ఫ్రీ సంబర్ 18004255364కు తెలియజేయవచ్చని అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News