గత కొన్ని రోజులుగా ఇక్రిశాట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తుండడంతో ఫారెస్ట్ అధికారలు రెండు రోజులుగా గస్తీ కాశారు. ఇటీవల రెండు సార్లు చిరుత కదలికలను గుర్తించిన ఉద్యోగులు ఇక్రిశాట్ అధికారులకు తెలపడంతో వారు నర్సాపూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. రాత్రి వేళల్లో మాత్రమే చిరుత సంచరిస్తుండడంతో దాని జాడలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే నిర్ధిష్ట ప్రదేశాలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు మంగళవారం బోనులు ఏర్పాటు చేసి రెండు మేకలను అందులో ఉంచారు. కాగా బుధవారం రాత్రి అధికారులు ఏర్పాటు చేసిన మేకలను తినడానికి వచ్చిన చిరుత బోనులో చిక్కింది. గురువారం ఉయయం గమణించిన ఉద్యోగులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక వాహనంలో బోనుతో సహా చిరుతను జూపార్క్‌కు తరలించారు.
మూడేళ్ల క్రితం కూడా ఇక్రిశాట్‌లో చిరుత సంచిరించడంతో ఫారెస్ట్ అధికారులు ఇదే తరహాలో బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇక్రిశాట్‌లో వ్యవసాయ పరిశోధనలకు కొంత ఏరియాను వినియోగిస్తుండగా మిగతా ప్రాంతమంతా అడవిలా తయారైంది. ఆ ప్రాంతంలోనే చిరుతలు, మిగతా అడవి జంతువులు ఉండొచ్చని, వికారాబాద్ లాంటి ఫారెస్ట్ ఏరియా నుండి అవి ఇక్కడికి వలస వచ్చి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో చిరుత కూడా ఇక్రిశాట్ పరిసరాల్లో సంచరిస్తుందనే అనుమానం ఉందని, ట్రాప్ కెమెరాలలో దాన్ని కూడా గుర్తించి బంధిస్తామని అధికారులు తెలిపారు. ఉద్యోగులెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు.