Thursday, December 26, 2024

అడవుల విధ్వంసంతో ముప్పు

- Advertisement -
- Advertisement -

అడవులు అనేక జీవులకు అవాస కేంద్రాలు. జీవుల శరీరంలో ఊపిరి తిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి. అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల (గ్రీన్ లంగ్స్) వంటివి. ఇవి గాలి కాలుష్య కారకాలను తొలగిస్తాయి. సహజ వాతావరణ ప్యూరిఫైయర్స్‌గా పని చేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారోత్పత్తులతో పాటు కలపను, ప్రాణ వాయువు (ఆక్సిజన్)ను సమృద్ధి పరిచే ప్రధాన కార్యాలయాలుగా పని చేస్తాయి. గ్రీన్ హౌస్ వాయువుల రిజర్వాయర్‌గా ఉంటాయి. అడవులు ఔషధ, ఆహార మొక్కలకు, వృక్ష, జంతు, జలవనరులకు ఆలవాలం. వర్షపాతానికి ప్రధాన ఆధారం. నేలకోత నివారణకు, శబ్ద కాలుష్య నియంత్రణకు తోడ్పడుతాయి. జీవ వైవిధ్య స్థిరత్వంలో సహాయ పడుతాయి. అడవులు సౌందర్యాత్మక, రసాత్మక, మానసికోల్లాస విలువలను కలిగి ఉంటా యి. భూమిపై మొట్టమొదటి మొక్కలు సుమారు 470 కోట్ల సంవత్సరాల క్రితం కేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి.

ఆ తర్వాత 100 కోట్ల ఏళ్ళ అనంతరం డీవోడియన్ కాలం లో అడవులు మొదటిసారి భూమిపై రూపుదిద్దుకున్నాయని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది. నాటి నుండి మానవుడు జ్ఞానవిప్లవం, వ్యవసాయ విప్లవాలతో, చెట్లతో సహవాసం చేస్తూ ప్రకృతి వరణంలో జీవిస్తున్నాడు. కానీ ఆధునిక మానవుడు నిరంతరం అభివృద్ధి, పట్టణీకరణలపై మక్కువ చూపుతూ స్వార్థంతో ప్రకృతి వినాశననికి పాల్పడుతున్నాడు. పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు, నివాస స్థలాల భవనసముదాయాల నిర్మాణం కోసం విచక్షణారహితంగా చెట్ల ను నరికివేయడం వల్ల సంప్రదాయ పర్యావరణ విలువలు తగ్గి అడవుల విధ్వంసానికి దారితీస్తున్నది. ఇది భూతాపం, లానినో, ఎల్‌నినో, వేడిగాలులు వంటి వాతావరణ అసాధారణతలకు, వరదలకు, కరవు కాటకాలకు, విపత్తులకు కారణమవుతోంది. అడవుల్లో వ్యాధిగ్రస్తమైన, క్రూర జంతువులు జన వాసాల్లోకి రావడం వల్ల ఎబోలా, జికా, బర్డ్ ఫ్లూ, సార్స్ , ఫ్లూజ్వరం, కరోనా(కొవిడ్ -19) వంటి జూనోటిక్ వ్యాధుల వ్యాప్తితో పాటు ధన, ప్రాణ నష్టం జరుగుతోంది.

ఈ సమస్యలకు ఏకైక మార్గం చెట్లను పెంచడమేనని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఈక్రమంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు ప్రస్తుత, ముందు తరాలకు అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను, విలువలను, అడవుల విధ్వంసం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడానికి 2013 నుండి ప్రతి సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గత ఏడు అడవులు, స్థిరమైన ఉత్పత్తి, వినియోగం అనే ఇతివృత్తంతో జరుపుకున్నాము.ఈ సంవత్సరం 2023లో అడవులు, ఆరోగ్యం అనే నినాదంతో ప్రపంచ అటవీ మహోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాము.
విధ్వంసం ముప్పులో అడవులు

భూగోళం ఇప్పుడు అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, భూతాపం, భూచల్లదనం, ఓజోన్ క్షీణత, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం, అణుయుద్ధాలు, భూకంప విస్పోటనాలు, అసాధారణ వాతావరణ మార్పులు, మహమ్మారి వ్యాధుల వ్యాప్తి, అడవుల క్షీణతలు అనేవి ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆటవిక భూమిని వ్యవసాయ భూమిగా మార్చ డం, సరైన భూమి నిర్వహణ పద్ధతుల లేమి, మానవ నివాసాలను సృష్టించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కలపను నిలకడగా కోయడం, పరిశ్రమల స్థాపన, అదుపులేని అక్ర మ మైనింగ్‌వంటి చర్యలు అడవుల విధ్వంసానికి సాధారణ కారణాలవుతున్నాయి. సహజంగా భూమిపై మూడింట ఒక వంతు విస్తీర్ణంలో అడవులు ఆక్రమించి ఉన్నాయి. యుఎన్‌ఒ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం అటవీ నిర్మూలన వల్ల ప్రపంచంలో 1 లక్ష 30 వేల కి.మీ మేర అడవులు అంతరించిపోతున్నాయని అంచనా.

ప్రపంచ వ్యాప్తంగా 19వ శతాబ్దం నుండి సుమా రు 12.9 కోట్ల కి.మీకు పైగా విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత 30 ఏండ్లలో 10% మేర సుమారు 420 మిలియన్ హెక్టార్స్ అటవీ భూములు కోల్పోయినట్లు ది స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్స్ -2022 నివేదిక పేర్కొంది. మన దేశ జాతీయ అటవీ విధానం ప్రకారం- 1952 ప్రకారం దేశ భూభాగంలో 33 % విస్తీర్ణంలో అడవులు కలిగి ఉండాలి. కానీ మన భూభాగంలో 24.62 శాతం మాత్రమే అడవులు కలిగి ఉన్నట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్- 2021 చెబుతోంది. కనుక అడవుల ఆవశ్యకతను ఇప్పటికైనా పాలకులు, ప్రజ లు గ్రహించకపోతే ఆక్సిజన్ కొరత, వాయు కాలుష్యం భవిష్యత్తులో ఒక సాధారణ సమస్యగా మారి, రానున్న కాలం లో ఊపిరి తీసుకోవడానికి ప్రాణవాయువు కూడా దొరుకని దుర్బర పరిస్థితి ఏర్పడుతుందని గమనించాలి. ఇటీవల జరిగిన గ్లాస్గో సదస్సు-2022 (కాప్ -26)లో 2030 నాటికి అడవుల నరికివేతకు ఫుల్‌స్టాప్ పెడుతామని భారత్‌తో సహా 110 దేశాధినేతలు చేసిన వాగ్దానాలను అమలు పరచాలని పర్యావరణవేత్తలు బలంగా అభిప్రాయపడుతున్నారు.

చారిత్రక హరిత దార్శనికతే ఆదర్శం

ప్రపంచ మానవ చరిత్రలో భారతీయులు అనాది నుండి ప్రకృతి పిపాసకులు, వనప్రేమికులు. సుమారు 10 వేల ఏండ్ల క్రితమే చెట్ల ప్రాముఖ్యతను గ్రహించి, పెంచి పోషించారు. బౌద్ధుల కాలంలో నలందా, తక్షశిల వనాలతో పాటు బుద్ధవనం, అమలాక్షవనం, వేణువనం, నాగవనం తదితర 40 కి పైగా వనాలను అభివృద్ధి పరిచారు. అఖండ భారతాన్నేలిన అశోక చక్రవర్తి ఆనాడు రోడ్లకిరువైపులా మొక్కలను నాటించి చరిత్రలో వనప్రేమికుడుగా ఖ్యాతి నొందారు. చోళులకాలంలో ఆనందవనాలు (హెవన్లీ గార్డెన్స్), మొగలాయిల కాలంలో ఆహ్లాదవనాలు (ప్లేజర్‌గార్డెన్స్) పెంచా రు. దీంతో ఆనాడు ప్రజలు, పాలకులు తమ స్వీయమనుగడ, ప్రజాసంక్షేమం కోసం చెట్లనుపెంచి పర్యావరణ పరిపుష్టికి తోడ్పడ్డారని అవగతమవుతోంది. కానీ నేడు మనిషి సృష్టిస్తున్న టెక్నాలజీతో స్వచ్ఛమైన గాలిని అందించే అడవులు లేకుండా పోతున్నాయి.

ఇంతటి ఘనమైన చారిత్రక, సాంస్కృతిక హరిత పరిపుష్టి కార్యక్రమాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని స్వాతంత్య్రానంతరం స్వయం సమృద్ధి సస్యశ్యామలం లక్ష్యాలుగా భవిష్యత్ తరాల భద్రత కోసం మన దేశంలో అటవీ, చెట్ల విస్తీర్ణాన్ని 33% పెంచడానికి జాతీయ అడవుల పెంపకం కార్యక్రమం, వనమహోత్సవం, గ్రీన్ ఇండియా మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, నమామి గంగే, గ్రీన్ యాత్ర, సంకల్ప్ పర్వా వంటి ఎన్నో హరిత కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన బృహత్తర హరిత ఉద్యమం హరితహారంలో మొత్తం 235కోట్లకు పైగా మొక్కలు నాటి, లక్ష్యాన్ని అధిగమించి దేశంలోనే గొప్ప ఆదర్శ హరిత కార్యక్రమంగా నిలుస్తోంది. ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు, జనహిత పర్యావరణ కార్యక్రమాల అమలు వల్ల భారతీయులు భవిష్యత్ చారిత్రక హరిత దార్శనికతకు ప్రతీకలుగా నిలుస్తున్నారు.
నేడు మానవుడు పర్యావరణం నుండి ప్రయోజనం పొందడంలోనే చురుకుగా ఉంటూ తిరిగి ఇవ్వడం మర్చిపోతున్నాడు. మనిషికి మొక్కలతో గల సంబంధ బాంధవ్యాల గురించి ‘సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్’అనే పుస్తకంలో పేర్కొన్న మాటలు సదా ఆచరణీయమైనవి. భూమిపై మొట్టమొదటి పౌరులైన చెట్లను నవ్యదృష్టితో, సరికొత్త ఆలోచనలతో అభినందించాలి.

చెట్లు మన దూరపు బంధువులు కాదు, మన కుటుంబ సభ్యులు అనే మైండ్ సెట్‌తో చెట్లను ఆత్మీయ బంధంతో పెంచి పోషించడం మన ప్రథమ కర్తవ్యం కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృక్ష సంరక్షణ చట్టాలను కఠినతరం చేయాలి. అడవుల పెంపకంలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించాలి. ప్రతి సంవత్సరం జులై నెలలో ‘నేషనల్ ప్లాంటేషన్ వీక్, ప్రతి సెప్టెంబర్‌లో ‘జాతీయ వృక్ష దినోత్సవం’లను అధికారికంగా నిర్వహించాలి. మొక్కల ఆవశ్యకత గురించి గ్రో-మోర్- ట్రీ కాంపేయిన్ పేరిట ప్రజలను, విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. సామాజిక అడవులు (సోషల్ ఫారెస్ట్రీ), శాస్త్రీయ అడవుల (సైంటిఫిక్ ఫారెస్ట్రీ) వృద్ధి కొరకు తెలంగాణకు హరితహారం లాంటి మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తం గా విస్తరించాలి. నాటిన మొక్కల సర్వైవల్ రేటును వంద శాతం పెంపుకి కృషి జరగాలి. సర్ సాన్టే రుక్ రహేతో బీ సస్తో జాన్ ఒక మనిషి ప్రాణం కన్నా ఒక చెట్టు ప్రాణం విలువైనది అని పేర్కొన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆధునిక భారతీయ వృక్ష సంరక్షణ ఉద్యమ యోధురాలు, చిప్కో ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అమృతా దేవి బిష్నోయ్ మాటల స్ఫూర్తిగా ‘హెల్దీ ఫారెస్ట్స్ ఫర్ హెల్దీ పీపుల్’ అనే ఆచరణాత్మక వైఖరితో సకలజనులం చిత్తశుద్ధితో చెట్ల పెంపకంలో, వనసంరక్షణలో ముమ్మరంగా భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.

డా. భారత రవీందర్
9912536316

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News