అటవీ రక్షణ ఇక ముందు భక్షణగా మారనున్నది. ఇప్పటికే అనధికారంగా సాగిపోతున్న అటవీ భూముల దురాక్రమణ భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల స్వప్రయోజనాల కోసం అధికారికంగానే జరిగిపోనున్నది. 1980 నాటి అటవీ రక్షణ చట్టానికి కేంద్రం తలపెట్టిన సవరణలకు లోక్‌సభ బుధవారం నాడు ఆమోదం తెలపడంతో ఈ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రతిపక్ష సభ్యులు మణిపూర్ ఘాతుకాలపై నిరసన తెలుపుతున్న సమయంలో సందట్లో సడేమియాగా బుధవారం నాడు కొత్త అటవీ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. చర్చకు అవకాశమివ్వకుండా వివాదాస్పద బిల్లులకు ఏకపక్షంగా పార్లమెంటు ఆమోద ముద్ర వేయించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందెవేసిన చేయి అనిపించుకొంటున్నది.
ఈ బిల్లును గత మార్చి 29వ తేదీనే సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానిని లోతుగా పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటు కమిటీ (జెపిసి) ని నియమించారు. ఆదివాసీ హక్కుల సంఘాలు సహా అనేక వైపుల నుంచి వెయ్యికి పైగా అభ్యంతరాలు జెపిసికి అందాయి. వాటిపై జెపిసిలో చర్చ జరిగినప్పటికీ ఏ ఒక్క దానిని అంగీకరించకుండా సవరణ బిల్లును యథాతథంగా లోక్‌సభ చేత ఆమోదింప చేయించారు. 1980 నాటి చట్టం అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్ళించినప్పుడు ఆ మేరకు వేరే భూమిని అటవీ శాఖకు ఇచ్చేలా చూసే అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టింది. ఇది గత నాలుగు దశాబ్దాలుగా అమల్లో వుంది.
2014 2020 మధ్య 14,800 చ.కి.మీ అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు మళ్ళించినట్టు సమాచారం. ఇది ఢిల్లీ నగర పరిమాణానికి 10 రెట్లు వుంటుందని తెలుస్తున్నది. అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్ళించడానికి వచ్చిన అభ్యర్థనల్లో కేవలం 1 శాతాన్ని మాత్రమే తిరస్కరించి మిగతా వాటినన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడైంది. అంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వకుండా అటవీ భూముల మళ్ళింపును కేంద్రం భారీగా అనుమతించిందని బోధపడుతున్నది. అటువంటప్పుడు కొత్తగా చట్ట సవరణ అవసరం ఏల కలిగిందో అర్థం కాదు. కొత్త చట్టం ప్రకారం ఎటువంటి ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వనవసరం లేకుండానే అటవీ భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
అధీన రేఖకు లేదా అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ లోపల వున్న అటవీ భూముల్లో ప్రధాన రహదారులు, జల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించడానికి ఇక ముందు ఎటువంటి అటవీ అనుమతుల అవసరముండదు. 15,100 కి.మీ నిడివిన వున్న అంతర్జాతీయ సరిహద్దు పొడుగునా పర్యావరణ రక్షణకు తోడ్పడే పచ్చిక బయళ్ళు, ఎడారులు, తేమ నేలలు, తక్కువ భూఆవరణ వున్న అడవులు, నిత్యం పచ్చగా వుండే వర్షాటవులు వున్నాయి. చాలా లోపలికి వుండడం వల్ల వీటిని ఇంత వరకు ఎవరూ స్పృశించలేదు.ఈ భూముల్లో ఏనుగులు, పులులు, అపురూప పక్షి జాతులు వంటివి సురక్షితంగా బతుకుతున్నాయి. గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదుల మూలాలు ఇక్కడ వున్నాయి.
వీటికి రక్షణ తొలగిపోడంతో ఇక్కడ కూడా నిర్మాణాలు మొదలు పెట్టి పర్యావరణానికి, ప్రజా జీవనానికి ముప్పు తీసుకొస్తారు. టిఎన్ గొడావర్మన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ అన్ని రకాల అటవీ భూములకు గట్టి రక్షణ కల్పించింది. ఏడు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతటా రైల్వే, రోడ్డు, జల మార్గాల నిర్మాణావసరాల కోసం అడవులను నరకడానికి, కలప కోసం వాటిని ధ్వంసం చేయడానికి ఎంత మాత్రం వీలు లేదని ఆ తీర్పు స్పష్టం చేసింది. అడవులే కాదు ప్రైవేటు వ్యక్తులు పెంచుకొనే మొక్కలు, తోటలు కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. వాటిని ఆశ్రయించే అపురూప పక్షి, జంతు జాలాలు వుంటాయి. అందుచేత చెట్లు నరకడం, అడవులను ధ్వంసం చేయడం జాతి వ్యతిరేక, మానవ వ్యతిరేక చర్యలుగా పరిగణించవలసి వుంటుంది.
అందుచేతనే అటవీ పరిరక్షణను ప్రభుత్వాల కర్తవ్యంగా చేస్తూ చట్టాన్ని తీసుకు వచ్చారు. సాగు నీటి ప్రాజెక్టుల దారిలోని అడవిని ఆక్రమించుకోడానికి వీలు లేకుండా చేశారు. ఒక వేళ అటువంటి అవసరాలకు అడవులను ధ్వంసం చేయవలసి వస్తే అందుకు అనుమతులు తీసుకోడం, ప్రత్యామ్నాయ అడవులను పెంచడానికి తగిన భూమిని ప్రభుత్వాలు కేటాయించడం తప్పనిసరి చేశారు. కొండల మీద, అడవుల్లోనూ గల విలువైన ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ప్రభుత్వాలు సాగిస్తున్న విధ్వంసం, అక్కడ నివసించే ఆదివాసులు, మూలవాసులు ఇతర చోట్లకు బలవంతంగా తరలిపోడం జరుగుతున్నది. వారందుకు అభ్యంతరం చెబితే తీవ్రవాదులని ముద్రవేసి హింసిస్తున్నారనే విమర్శ వున్నది.తాజా అటవీ చట్టంతో ప్రభుత్వాలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు ఎదురుండదు.