Thursday, December 26, 2024

అడవులు భూమి ఊపిరితిత్తులు!

- Advertisement -
- Advertisement -

మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం. అటవీ సంపదలో దట్టమైన హరిత సంపదలు, అందులో అంతర్భాగమైన జీవజాతులు లేదా వన్యప్రాణులు వస్తాయి. అడవుల్లో ఉండే జంతు, వృక్షజాలం మానవాళికి వెలకట్టలేని మేలును చేస్తున్నది. మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా అడవులలో జీవించే వృక్ష, జంతుజాలాన్ని వన్యప్రాణులుగా పిలుస్తారు. వన్యప్రాణుల్లో భారీ ఏనుగులు, జిరాఫీలు, రైనోలతో మెుదలు పక్షులు, క్రిమికీటకాలు, సూక్మజీవులు వస్తాయి. దేశవ్యాప్తంగా వన్యప్రాణులను అటవీ సంపదగా కాపాడుకుంటూ జీవవైవిధ్యాన్ని పదిలపరుచుకోవాలనే అవగాహన సమాజంలో కల్పించడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

వన్యప్రాణులను ఆహారంగానేకాకుండా జంతు అవయవాలు, కలప అక్రమ వ్యాపారం కోసం చట్టాలను ఉల్లంఘించి వేటాడం/నరకడం జరుగుతోందనేది కఠిన వాస్తవం. వన్యప్రాణి ప్రాముఖ్యతను గుర్తించిన ఐరాస తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 15వ అంశంగా జీవవైవిధ్య పరిరక్షణను తీసుకొని వన్యప్రాణుల మనుగడ ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తూ, సభ్యదేశాలకు దిశ నిర్దేశనం చేస్తున్నది. ఇదే క్రమంలో వన్యప్రాణుల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే సదుద్దేశంతో 1973లో సిఐటిఇయస్ (కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేన్‌జర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్ ఫానా అండ్ ఫ్లోరా) వ్యవస్థాపన దినం గుర్తుగా తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి మార్చి 03న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా చేబడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా 5,500 రకాలైన జీవజాతులను పలు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమంగా విక్రయిస్తున్నారని తేలింది.

వన్యప్రాణుల పరిరక్షణతోనే జీవవైవిధ్యం నెలకొంటూ, కాలుష్యం తగ్గించబడి, పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుంది. 1952లో ఏర్పాటు చేసిన భారత జాతీయ వన్యప్రాణుల మండలి చొరవతో వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి. ఇండియాలోని అడవుల్లో 91,797 రకాలైన జంతుజాతులు, 46,340 రకాల వృక్షజాతులు ఉన్నది.వీటికి తోడుగా 2,634 రకాల చేపల జలజాతుల సంపద మన దేశంలో ఉన్నది. ప్రపంచంలోని జీవజాతుల్లో 80 శాతం వరకు జీనవైవిధ్యం కలిగిన జంతు సంపద మన దేశంలోనే ఉంది.

వీటిలో క్షీరదాలు, పక్షులు, సరిసృపాలు, ఉభయచరాలు లాంటి జీవుల అపారసంపద మన అడవులకు, మానవాళికి ఎనలేని సేవలందిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కేరళ అడవుల వరకు అపార జీవ వైవిధ్యంతో అటవీ గొర్రెలు, మేకలు, పులులు, చిరుతలు, అడమి దున్నలు, గేదెలు, అటవీ పిల్లులు, జింకలు, లంగూర్స్, కోతులు, గాడిదలు, ముళ్ళ పందులు, దుప్పులు, కుందేళ్లు, నక్కలు, ముంగీసలు, హైనాలు, గబ్బిలాలు, కుక్కలు, పలు రకాల పాములు, మెుసళ్లు, ఒంటెలు, ఏనుగులు, సింహాలు, తాబేళ్లు, బల్లలు, వైవిధ్యభరిత 2000 రకాల పక్షులు, ఖడ్గమృగాలు, అపార క్రిమికీటకాలు లాంటి అసంఖ్యాక జంతుజాలం మన అడవుల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

అతి పెద్ద జీవవైవిధ్యం కలిగిన 12 దేశాలలో భారత్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. మన దేశంలోని ఈస్టర్న్ హిమాలయాలు, వెస్టర్న్ ఘాట్స్ అంతర్భాగంలో ప్రపంచపు 20 శాతం జంతుజాలం ఉంది. ఇండియాలో 3.64 శాతం భారత భూభాగంలో 1.2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో 553 అభయారణ్యాలు ఉన్నాయి. వనానికి అందాన్నిచ్చే దట్టమైన వృక్షాలు, అనేక రకాల జంతు జాతులు సకల మానవాళికి జీవవైవిధ్యం కల్పిస్తూ అపూర్వ సేవలు అందిస్తున్నాయి. జీవవైవిధ్యానికి విఘాతం కలిగితే కరోనా లాంటి విశ్వమహమ్మారులు విజృంభిస్తాయని మన ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు తెలుపుతున్నాయి. భూమిని నివాసయోగ్యం గ్రహంగా కాపాడుకున్నపుడే భవిష్యత్ తరాలు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకర వాతావరణంలో నివసించగలుగుతారు. జీవకోటి సమతుల్యత కోసం వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తించాలి.

* డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News