మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అటవీ అధికారి ప్రాణాలను బలిగొంది. అటవీ భూములను కాపాడేందుకు వెళ్లిన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ఉద్యోగ నిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోడు భూముల సాగుదారులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా అటవీ అధికారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చి, వారు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్న క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ జరిగే దశలో జరిగిన దారుణ హత్య అటు అధికారుల్లో ఇటు ప్రజల్లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు ఎర్రబోడు అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న వలస గుత్తి కోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో అక్కడ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో మడకం రమేష్ అతని కుమారుడు తూల పశువులను మేపుతున్నట్లు వాచర్ భూక్య రాములు గమనించి సెక్షన్ అధికారి తేజావత్ రామారావుకు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఎఫ్‌ఎన్ ప్లాంటేషన్‌ను సందర్శించి ఆ తరువాత సమీపంలో ఉన్న మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఉన్న ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాస్‌కు రామారావు ఈ విషయాన్ని వివరించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. పశువులను అక్కడి నుంచి తరలించేందుకు చేసే క్రమంలో అప్పటికే ఆ అధికారిపై కక్ష పెంచుకున్న ఇరువురు ఒక్కసారిగా గొడ్డలి, కత్తులతో మెడపై దాడి చేయడంతో శ్రీనివాస్ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన రామారావు ఉన్నతాధికారులకు జరిగిన ఘటన వివరించడంతో వారు అక్కడకు చేరుకుని రేంజర్‌ను సమీపంలోని చండ్రుగొండ పిహెచ్‌సికి తరలించారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్తగూడెం డిఎస్‌పి వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో జూలూరుపాడు,చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి సిఐ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. వివాదాలకు దూరంగా వృత్తిని దైవంగా భావించి క్రమ శిక్షణతో విధులు నిర్వహించే శ్రీనివాస్ అకస్మాత్తుగా హత్యకు గురై చనిపోవడంతో తోటి సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన వారు విధి నిర్వహణలో తమకు ఎదురవుతున్న ఆటుపోట్లను ఏకరువు పెడుతూ మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, అడవుల్లోకి వెళ్లే తమకు ఆత్మ రక్షణకు అవసరమైన ఆయుధాలు సమకూర్చాలని కోరారు.
అటవీ శాఖలో మంచి అధికారిగా శ్రీనివాస్‌కు గుర్తింపు
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపుడి గ్రామానికి చెందిన చలమల శ్రీనివాస్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మంచి అధికారిగా గుర్తింపు ఉంది. తొలుత బయ్యారంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన అనంతరం చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో తమ ఆటలు సాగడంలేదని కొంతకాలంగా కొందరు ఆయనపై ద్వేషం పెంచుకున్నట్లు తెలుస్తుంది.
తమ జీవనాధారానికి అడ్డు వస్తున్నారని, తరచూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుత్తికోయలు ఆగ్రహం పెంచుకున్నారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఆయనపై అప్పటికే పగ పెంచుకున్న వారు ఒక్కసారిగా దాడి చేసినట్లు తెలుస్తుంది. ఎప్పుడు విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరిస్తూ తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలిగేవాడని, ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయంగా ఉండే వారని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.