Monday, December 23, 2024

క్రీడలతో దేహ ధారుడ్యం, మానసిక ఉల్లాసం : డోబ్రియల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల రక్షణలో నిత్యం పనిచేసే అటవీశాఖ సిబ్బంది, అధికారులకు మంచి దేహధారుడ్యం, మానసిక ఉల్లాసం అవసరమని, అందుకు సరైన మార్గం నచ్చిన ఆటలు ఆడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ శాఖ క్రీడలను (స్పోర్ట్ మీట్) ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చార్మినార్, భద్రాద్రి, రాజన్న, యాదాద్రి, జోగులాంబ, బాసర, కాళేశ్వరం అటవీ సర్కిళ్లకు చెందిన అటవీ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని, మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో విజేతలను జాతీయ స్థాయి అటవీ పోటీలకు రాష్ట్రం తరపున ప్రతినిధులుగా పంపుతారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ, ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్న సిబ్బందిని పిసిసిఎఫ్‌తో సహా, ఉన్నతాధికారులు ప్రోత్సహించారు. విజేతలకు బహుమతులు అందించారు.

ఓపెన్, వెటరన్, సీనియర్ వెటరన్ కేటగిరీల్లో వివిధ రకాల ఆటల పోటీలను పురుషులు, మహిళలకు నిర్వహించారు. రన్నింగ్, కబడ్డీ, లాంగ్ జంప్, వెయిట్ లిఫ్టింగ్, డిస్కస్ త్రో, క్యారమ్స్, చెస్, రైఫిల్ షూటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు రెండు రోజుల పాటు జరిగాయి. నిత్యం పని ఒత్తిడిలో ఉండే అధికారులు, సిబ్బంది తమ హోదాలను పక్కన పెట్టి కలిసి మెలిసి పలు ఆటలను ఆడారు. విజేతలను పరస్పరం అభినందించుకున్నారు.క్రికెట్‌లో జోగులాంబ అటవీ సర్కిల్ విజేతగా నిలిచింది, ఓవరాల్ ఛాంపియన్‌గా చార్మినార్ అటవీ జోన్ ఎన్నికైంది. వ్యక్తిగత కేటగిరీల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్‌కుమార్, బీట్ ఆఫీసర్ సునీత, చీఫ్ కన్జర్వేటర్ సోనిబాలదేవి మంచి ప్రతిభతో పతకాలు సాధించారు. పిసిసిఎఫ్ (ఎఫ్‌ఏసీ) మోహన్ చంద్ర పర్గెయిన్ స్పోర్ట్ మీట్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉత్సాహంగా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పిసిసిఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఫారెస్ట్ అకాడెమీ ఇంఛార్జి డైరెక్టర్ ఏలూసింగ్ మేరు, ఫారెస్ట్ కార్పొరేషన్ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, ఉన్నతాధికారులు సునీత భగవత్, వినోద్‌కుమార్, రామలింగం, సైదులు, అన్ని సర్కిళ్లకు చెందిన అధికారులు, జిల్లాల అటవీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News