Wednesday, January 22, 2025

తెలంగాణలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటు అయ్యింది.. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించి.. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటుతో మండలాల సంఖ్య 12కు చేరుకున్నాయి.

రంగారెడ్డిలో ఇర్విన్ మండలం ఏర్పాటుకు ప్రతిపాదన
కొత్తగా రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్ మండల ఏర్పాటుకు రెవెన్యూశాఖ ప్రతిపాదించింది. మాడ్గుల్ మండలం నుంచి తొమ్మిది గ్రామాలతో ఇర్విన్ మండలం ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ రెవెన్యూశాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే పది రోజుల్లో సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలున్నాయి. అలాగే 12 మున్సిపాలిటీలు, మూడు నగరపాలక సంస్థలున్నాయి. ఇర్విన్ మండల ఏర్పాటుతో మండలాల సంఖ్య 28 కి చేరనున్నది.

హనుమకొండ జిల్లాలోని రెండు గ్రామాల బదలాయింపునకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేశారు. వేలేరు మండలం ఎర్రబల్లె గ్రామాన్ని అదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలానికి బదలాయించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజుల గడువు ఇస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News