గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్‌సిగా, ఎంఎల్‌ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు, పిసిసి అధ్యక్ష పదవి నిర్వహణ, రోశయ్య సిఎంగా ఉండగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహం నుంచి గాంధీభవన్‌కు భౌతికకాయం తరలింపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు, హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో గల ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు రోశయ్య ఇంటికి వెళ్లి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన బిపి పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఎపి రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడిగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 19668, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ సిఎంలు మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎన్.జనార్థన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా రోశయ్య బాధ్యతలు నిర్వహించారు.
ఆ తర్వాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తుక శాఖలు చేపట్టారు. 1991లో నేదరుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలను నిర్వర్తించారు. 2004,2009లో వైఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 16 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడెవ్జట్ ప్రవేశపెట్టి ఘనతను సొంతం చేసుకున్నారు. ఇందులో చివరి ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఇంకా 199597 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా రోశయ్య పనిచేశారు. 1978లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా తన సేవలు అందించారు. ఆ సమయంలోనే కర్ణాటక ఇంఛార్జ్ గవర్నర్‌గా రోశయ్య అదనపు బాధ్యతలు చేపట్టారు.
నేడు కొంపల్లిలో రోశయ్య అంత్యక్రియలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్మ అంత్యక్రియలు నేడు (ఆదివారం) హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలోని జరగనున్నాయి. కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రోశయ్య మృతి పట్ల మూడు రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతిక కాయం
ఆదివారం ఉదయం వరకు రోశయ్య భౌతిక కాయం ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. నేడు(ఆదివారం) ఉదయం శాస్త్రోక్తమైన కార్యక్రమాల అనంతరం ఆయన భౌతిక కాయాన్ని గాంధీభవన్‌కు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి కొంపల్లి ఫామ్‌హౌస్ వరకు రోశయ్య అంతిమయాత్ర సాగుతుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
అయితే తొలుత రోశయ్య అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో జరగనున్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత కెAవిపి రామచంద్రరావు తెలిపారు. అయితే ఆ తర్వాత కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి కుటుంబసభ్యులు వచ్చినట్లుగా తెలిసింది.
సంతాపం తెలిపిన ప్రముఖులు..
రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపి రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవి, సిఎం ఎంకె స్టాలిన్, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎపి పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్, ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ, ఎపిలకు చెందిన పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, రాజకీయ సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
రోశయ్య భౌతిక కాయానికి సిఎం కెసిఆర్ నివాళి…
తెలంగాణ సిఎం కెసిఆర్ రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. రోశయ్య పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో నేడు అంత్యక్రియలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్‌కు రోశయ్య కుటుంబసభ్యులు తెలిపారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఇక పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు అమీర్‌పేటలోని రోశయ్య ఇంటికి చేరుకుని ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు.
అత్యున్నత విలువలకు మారుపేరు రోశయ్య: సిజెఐ
ఉమ్మడి ఎపి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరుగాంచారని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కొనియాగారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేవారని చెప్పారు. అత్యున్నత విలువలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తుల్లో రోశయ్య ఒకరని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషకు, సంస్కృతికి, కళలకు ఆయన పెద్దపీట వేశారని చెప్పారు. రోశయ్య మరణం తెలుగు వారందరికీ తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Former AP CM Rosaiah Dies at 88