Friday, January 24, 2025

విఫలమవుతున్న ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

‘భారత దేశాన్ని హిందూ రాష్ర్టంగా మార్చాలని బిజెపి ఎన్నో ప్రయత్నాలూ చేస్తోంది. దీని వల్ల దేశంలో ప్రజాస్వామ్యం అన్నిరకాలుగా విఫలమై ఎన్నికల నియంతృత్వం స్థిరపడుతోంది. విద్వేషం, విభజించడం అనేవి రాజకీయాలలో కానీ, సమాజంలో కానీ ఎల్లకాలం సాగవు’ అని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా స్పష్టం చేశారు. ప్రముఖ ప్రజాసేవకుడు, విద్యావేత్త డి.ఎస్.బోర్కర్ స్మారకార్ధం ‘భారత దేశం కోసం నా దృష్టి: 2047’ అన్న అంశంపై ఇటీవల ఆయన చేసిన ఉపన్యాసంలో సంక్షిప్తంగా కొంత భాగం. ‘భారత దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ రాజకీయంగా, సమాజికంగా, ఆర్థికంగా మన రాజ్యాంగ హామీలు ఏమేరకు నెరవేరాయనే విషయం చర్చించడానికి ఇది తగిన సమయం. సమాచార సాంకేతిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో, ముఖ్యం గా అంతరిక్ష పరిశోధనల్లో నేను గర్వంగా చెప్పడానికి కొన్ని విజయాలున్నాయి. చంద్రుడిపైన చంద్రయాన్3 కాలు మోపినప్పుడు కోట్లాది మందితో పాటు నేను కూడా ఆనందంతో కేరింతలు కొట్టాం.

నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు స్వాప్నికుడైన మా సైన్స్ టీచర్ ఆకాశానికి ఆవల ఉన్న విషయాల గురించి; ముఖ్యంగా నాసా, భారత అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టుకు పితామహులైన హోమీ బాబా, విక్రవ్‌ు సారాబాయిల గురించి చెప్పాడు. ఆగస్టు 23న చంద్రుడిపైన మన ఉపగ్రహం కాలు మోపిన క్షణాలు నన్ను ఉద్వేగానికి గురిచేశాయి. కానీ, అనేక విషయాలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.వాటిని కాస్త లోతు గా చూస్తే భారతీయ సమాజం కానీ, ఇక్కడి సంస్థలు కానీ విచ్ఛినమవుతూ, సంక్షోభంలో కూరుకుపోవడం అనేది ఒక వాస్తవం. ప్రజాస్వామిక సూత్రాలు ప్రత్యక్షంగా తారుమారు కావడం లేదు కానీ, కొన్ని దశాబ్దాలుగా ప్రజాస్వామిక సంస్థలు మాత్రం జవాబుదారీతనం లేకుండా, తటస్థ వైఖరి ననుసరిస్తూ రాజీపడిపోతున్నాయి. ఒక కృత్రిమమైన, విద్వేషపూరిత సంస్కృతిని పెంచిపోషిస్తున్నారు. అడ్డుఅదుపు లేకుండా ప్రజల మధ్య విభజనను తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింల పట్ల విద్వేషం కల్పించారు. మనం గతాన్ని మర్చిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని తాత్వికులు, మేధావులు గుర్తు చేస్తున్నారు. ‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వారు తప్పులు పునరావృతమవడానికి కారణమవుతారు’ అని చర్చిల్ అంటాడు.

ఈ రోజుతో పోల్చుకున్నట్టయితే 1947 నాటి దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దృశ్యం చాలా గిజిబిజిగా ఉండేది. సాంస్కృతిక విలువలు మారడానికి సంఘర్షణపడుతున్న దశ అది. రాజకీయ, సామాజిక రంగాలలో మార్పుకోసం ఒత్తిడి పెరుగుతున్న దశ అది. ఒక స్వతంత్ర భారత దేశం ఎలా ఉండాలి, జాతీయ వాదానికి అర్థం ఏమిటి అన్న వాటికి ఆలోచనా పరులు నిర్వచనాలిచ్చారు. ‘జాతీయ వాదం’ అంటే అభ్యుదయం, విప్లవాత్మకం, ప్రజానుకూలం, దేముడు, అతీంద్రియ శక్తులకు అతీతమైన జాతీయవాదం అన్న అర్థాలొస్తాయి. హిట్లర్ చెప్పిన జాతీయ వాదం గాంధీజీ చెప్పిన జాతీయ వాదానికి భిన్నమైంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా, కులం, మతం, భాషలతో ముడిపడకుండా ఏర్పడినది మాత్రమే భారతీయ దృక్పథంలో జాతీయవాదం. భారతీయ భవిష్యత్తు దాని పురాతన చరిత్రపై ఆధారపడిందని హిందూ పునరుద్ధరణ వాదం భావిస్తోంది. మా తాత 1940లో హిందూ మహాసభ అధ్యక్షుడు. నా బాల్యపు తొలి రోజుల్లో వి.డి. సావర్కార్ రచనలు చదివాను. సావర్కార్ హిందువుల పరిపాలనలో హిందూ రాష్ర్టం, అఖండ భారతం రావాలని భావించాడు. భారత దేశం హిందువుల పూర్వీకుల జన్మభూమి అని, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలని భావించాడు.

ముస్లింలు, క్రైస్తవులు వేరే ప్రాంతానికి చెందిన వారని సావర్కార్ అన్నాడు. ‘విదేశీ జాతులు హిందూ జాతిలో కలిసిపోవడం ద్వారా తమ ఉనికిని కోల్పోవాలి లేదా హిందు జాతికి లొంగిపోయి బతకాలి. అంతకు మించి ఏ గౌరవాన్నీ, పౌరసత్వాన్ని కూడా కోరుకోకూడదు’ అని ఆ తరువాత గోల్వాల్కర్ కూడా రాశాడు. హిందుత్వ వాదులు లౌకిక భావనకు భిన్నంగా ఉన్నారు. హిట్లర్ ముస్లింల పట్ల వ్యవహరించిన తీరును సావర్కార్ సమర్థించాడు. ఈ నేపథ్యానికి భిన్నంగా బహుళత్వం ఉన్న భారతీయుల కోసం రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించింది. అది అందరినీ కలుపుకుపోయే మార్గాన్ని ఎంచుకుంది. భిన్నజాతులవారు కలిసి శాంతియుతంగా సహజీవనం సాగించి, ఒకే జాతిగా ఏర్పడడానికి మార్గం సుగమం చేసింది. భారత్ పాకిస్థాన్‌లు 1947లో భిన్న సైద్ధాంతిక మార్గాలను ఎంచుకున్నాయి. భారత దేశం ఉద్దేశపూర్వకంగానే మత రాజ్యంగా ఏర్పడదలుచుకోలేదు.

‘భారత దేశం హిందూ మతంతో హిందూ రాష్ర్టంగా ఏర్పడడం సాధ్యం కాదు. ఇక్కడ ఇతర అల్పసంఖ్యాకుల వారు కూడా ఉన్నారు. వారిని రక్షించే బాధ్యత మన ప్రాథమిక కర్తవ్యం.కులం, మతం, జాతితో సంబంధం లేకుండా అందరితో కలిసి రాజ్యం మనుగడ సాగించాలి”అని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో రాశారు. భిన్నత్వం ఉన్న భారత దేశం భిన్న సంస్కృతులను కలగలిసిన సమాజంగా ఏర్పడాలని రాజ్యాంగ నిర్మాతలు గణతంత్ర ప్రజాస్వామ్య విధానాన్ని ఎంపిక చేశారు. ఫలితంగా ‘కులం, మతం, లింగ, జాతి, పుట్టిన ప్రాంతం, మరే ఇతర కారణాలను చూపి ఏ పౌరుడిపైన కూడా ప్రభుత్వం వివక్ష ప్రదర్శించరాదు’ అని రాజ్యాంగం లౌకివాదం, సమానత్వంతో ప్రకటించింది. రాజ్యాంగ సభలో ‘భగవంతుని పేర’ అని చేర్చమని హెచ్.వి. కామత్ చేసిన ప్రతిపాదన ‘సంకుచితం, ఒంటెత్తుపోకడ’తో ఉందని హరింద్య్రనాథ్ కుంజు తిరస్కరించారు.రాజ్యాంగం అనేది అందరికీ సమానత్వం, సమానావకాశాలు కల్పించడానికి వేసిన మార్గం. ఇంకా ‘జాతి నిర్మాణం’ జరగవలసి ఉంది.

అందరినీ కలుపుకుపోవడానికి అధికార నిర్మాణం భిన్నంగా పని చేస్తోంది. కేంద్రంలో, రాష్ర్టంలో దళితులు, ఇతర పీడిత వర్గాలను రాజకీయాల్లోకి తీసుకు రావడానికి మండల్ ఆందోళన దోహదం చేసింది. రాజ్యాంగ సవరణలు క్షేత్ర స్థాయి లో పరిపాలనా వికేంద్రీకరణకు దోహదం చేశాయి. స్వాతంత్య్రోద్యమంనాటి నుంచి సాంస్కృతిక ఉద్యమాలు వారసత్వంగా వస్తున్నాయి. తొలి తరం నుంచి వచ్చిన ఉద్యమాలు జాతి నిర్మాణానికి దోహదం చేశాయి. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్(ఎంకెఎస్‌ఎస్) ఉద్యమం, నర్మదాబచావో ఆందోళన, చిప్కో ఉద్యమం, మహిళల హక్కుల కోసం చేపట్టిన అనేక ఉద్యమాలు ప్రజల హక్కుల కోసం చట్టాలు చేయడానికి దోహదం చేశాయి. వాటిలో షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయతీలను విస్తరించే చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యాహక్కు చట్టం, మధ్యాహ్న భోజన పథకం, అటవీ హక్కుల చట్టం వంటివి కొన్ని. వీటి అమలు సమర్ధవంతంగా లేని మాట వాస్తవం. ఈ నమ్మకాలన్నిటినీ నీరుకార్చడం పట్ల మనకు చాలా బాధగా ఉంది. భారతదేశం అనేక వైరుధ్యాల పుట్ట. మధ్య తరగతి బాగా పెరిగింది.

విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, ఉద్యోగావకాశాలు, పరిశుభ్రమైన పరిసరాలు లభించక మన జనాభా చాలా దుర్భలంగా తయారైంది. ‘నెహ్రూ నుంచి మోడీ దాకా అన్ని ప్రభుత్వాలు ప్రజల మౌలిక అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి’ అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అశోకా మోడీ గుర్తు చేస్తారు. ‘తీవ్ర నిరుద్యోగం పెరిగిన ఫలితంగా సామాజిక హింస చెలరేగుతుంది’ అని హెచ్చరించారు. న్యాయస్థానాలు, పార్లమెంటు, పోలీసులు, పౌర పాలనాధికారుల వంటి సాధారణ వ్యవస్థలపైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. భారతదేశ చరిత్రలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ కాలం నుంచి అది మొదలైంది. సమాజంలో స్నేహం క్షీణించి, కులం, మతం మరింత బలంగా తయారై సమాజానికి పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉదారత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మతశక్తులు బలపడడం గమనిస్తున్నాం.
మతోన్మాద శక్తుల పెరుగుదల
‘హిందూ రాష్ర్టం, హిందూ జాతి, హిందూ సంస్కృతి’ అన్న సావర్కార్ ఆలోచనతో, ఒక బలమైన రాజకీయ మద్దతుతో ప్రజలను విభజించే మత జాతీయవాదంతో మతోన్మాదం జడలు విప్పడం ఆందోళన కలిగించే విషయం. సావర్కార్ సిద్ధాంతాన్నే ఆలోచిస్తే, భౌగోళికంగా భారత దేశానికి ఆవలనుంచి వచ్చిన వారు భారతీయులుకారు సరికదా, రెండవ శ్రేణిపౌరులు మాత్రమే అవుతారు. ముస్లింలు, క్రిస్టియన్ల మతాలు భారత దేశంలో పుట్టినవి కావు కనుక వారు భారతీయులు కారంటాడు. భౌగోళికంగా కానీ, మతపరంగా కానీ ప్రజలను ఇలా నిర్వచించలేం.కానీ ఈ భయంకరమైన ఆలోచనలు ఇప్పటికీ భారత దేశంలో ఉన్నాయి. మైనారిటీలు తమ పౌరసత్వాన్ని రెండవ శ్రేణికి తగ్గించేస్తారని భయం భయంగా జీవిస్తున్నారు. ‘ను’, ఢిల్లీ వంటి ప్రాంతాలలో జరిగే సంఘటనలు ఈ భయాలను బలపరుస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌ల లో చంపడం, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యాపారాలను పంచాయతీలు నిషేధించడం, ‘బుల్డోజర్ రాజకీయాలు’ వంటి న్యాయవ్యవస్థకు అతీతమైన చర్యలు ఈపరిస్థితిని పెంచుతున్నాయి.

చట్టపరమైన ఆదేశాలు లేకుండా, అనుమతి లేకుండా ఇళ్ళను, వ్యాపారాలను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం అనేది శక్తికి చిహ్నంగా మారింది. దీంతో అమాయక జీవితాలు, వారి జీవనోపాదులు నాశనమైపోతున్నాయి. కేవలం నేరాలలో పాలు పంచుకున్నారనో, దాడులకు తెగబడ్డారనో అనుమానంపై వారి ఇళ్ళను ధ్వంసం చేస్తున్నారు. చట్టానికి అతీతంగా చేపట్టే ఈ ఇళ్ళను ధ్వంసం వల్ల ఆ ఇళ్ళలో ఉన్న వారు, ఆ మతానికి చెందిన వారు ఎంతో నష్టపోతున్నారు! ధ్వంసమైన వారి ఇళ్ళు మాత్రమే కాదు, ధ్వంసమైన వారి జీవితాలను ఎవరు పునర్నిర్మిస్తారు? ఈ దారుణమైన చర్యలను ప్రభుత్వం గ్రహించగలుగుతుందా? చట్ట నిబంధనల బాధ్యతలు కలిగిన న్యాయస్థానాలు మౌనంగా, ప్రేక్షకుల్లా ఉండిపోతున్నాయి. నేను తప్పు చేయకపోతే, అమాయక బాధితులకు న్యాయం లభిస్తుంది. ఎప్పుడైనా, అప్పుడప్పుడూ, పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచిలాగా సుమోటోగా కేసును స్వీకరించి బలమైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసు దానంతట అదే పరిష్కారమవుతుంది. రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల మద్దతు గల పత్రికలు మత విద్వేషాన్ని పెంచుతున్నాయి. విద్వేష ప్రసంగాలను అణచివేయాలని సుప్రీం కోర్టు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోగా, హింస, విద్వేషం కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News