న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004 జూన్ 1న 35వ భారత ప్రధాన న్యాయమూర్తిగా(సిజెఐ) జస్టిస్ లహోటి బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లహోటి 2005 నవంబర్ 1న పదవీ విరమణ చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పిటిఐ) బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో ఆయన మాజీ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. టెలికాం దిగ్గజం వొడాఫోన్‌కు చెందిన రూ. 20,000 కోట్ల పన్నుల వివాదం కేసులో భారత ప్రభుత్వం తరఫున ఆరిట్రేటర్‌గా ఆయన వ్యవహరించారు. 1940 నవంబర్ 1న జన్మించిన జస్టిస్ లహోటి 1960లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బార్ సభ్యుడిగా చేరారు. 1962లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1977 ఏప్రిల్‌లో నేరుగా జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన 1978లో రాజీనామా చేసి తిరిగి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేపట్టారు. 1988 మే 3న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన మరుసటి ఏడాది ఆగస్టులో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 1994లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ లహోటి 1998 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Former Chief Justice RC Lahoti Passes away