తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నగలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో జయలలితకు ఒక కేసులో కోర్టు విధించిన జరిమానా చెల్లిస్తారు.
అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇదే కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు 10 కోట్ల చొప్పున జరిమానా విధించింది. కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో అప్పీల్ చేయగా, వారిని విడుదల చేయాలంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనిపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే జయలిలత 2016లో మరణించారు. అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
జయలలిత చెల్లించవలసిన 100 కోట్ల జరిమానాను ఎవరూ చెల్లించకపోవడంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జయలలిత ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న 28 కిలోల నగలను, 800 కిలోల వెండి నగలను కోర్టుకు అప్పగించారు. ఈ నగలను వేలంవేయగా వచ్చిన డబ్బుతో జరిమానా చెల్లిస్తారు. వీటి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. జయలలిత స్థిరాస్తులను వేలం వేసి, మిగిలిన 60 కోట్ల రూపాయల జరిమానాను చెల్లిస్తారు.