మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎ, పెద్దమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి శనివారం నాడు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దమ్మతల్లి గుడి ఆవరణలో ఘటన జరిగిందన్న రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఈక్రమంలో రేవంత్ వ్యాఖ్యలు పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఎసిపికి విన్నవించారు. కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్‌నపై లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్ సభ్యులు ఖండించారు.
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెద్దమ్మ గుడి ఆలయ ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పిజెఆర్ కుమారుడు, మాజీ ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ నేత విష్ణువర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదని, రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్లారిటీ ఇచ్చినా రేవంత్ బద్నాం చేస్తున్నారని, ఇది పార్టీ వ్యవహారం కాదని పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని విష్ణు ఈ సందర్భంగా హెచ్చరించారు. రేవంత్‌పై టెంపుల్ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. పెద్దమ్మ టెంపుల్‌పై మాట్లాడేముందు తనను రేవంత్ కనీసం సంప్రదించలేదని పేర్కొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో అత్యాచారం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసలు అత్యాచార ఘటన పెద్దమ్మ గుడి వెనుకాల ఉన్న ఏదో కాలనీలో జరిగిందని పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎ,పెద్దమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.