న్యూఢిల్లీ : ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సిఎం ఓ ప్రకాష్ చౌతాలాను ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. మే 26 న చౌతాలాకు శిక్ష విధింపుపై కోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. 1993 2006 మధ్య ఆదాయానికి మించి రూ. 6.09 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారని చౌతాలాపై 2010 మార్చి 26 న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2013 టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో చౌతాలా తీహార్ జైలులో శిక్ష అనుభవించి 2021 జులైలో విడుదల కాగా, 2021 జనవరిలో ఢిల్లీ కోర్టు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మనీ ల్యాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది.
మనీ ల్యాండరింగ్ కేసులో 2019 ఏప్రిల్‌లో ఢిల్లీ, పంచ్‌కుల, సిర్సాల్లో చౌతాలాకు చెందిన రూ. 3.68 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. చౌతాలా 19932006 మధ్య రూ.6.09 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టారని , వీటి కొనుగోలుకు అవసరమైన ఆదాయ వనరులు ఏమిటనేది తెలియదని సీబీఐ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది. మరోవైపు చౌతాలా పెద్ద కుమారుడు అజయ్ చౌతాలా రూ. 27.74 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటుండగా, చిన్న కొడుదకు రూ. 119 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా ప్రస్తుతం హర్యానాలో పాలక బీజేపీ జేజేపీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.