Saturday, December 21, 2024

హర్యానా మాజీ సిఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ ( ఐఎన్‌ఎల్‌డి ) చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా ( 89) కన్ను మూశారు. గురుగ్రామ్ లోని ఆయన నివాసంలో శుక్రవారం గుండెపోటు రావడంతో తక్షణం మేదాంత ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1989 నుంచి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఓం ప్రకాశ్ చౌతాలా 1935లో జన్మించారు. ఆయన భారత దేశానికి ఆరో ఉప ప్రధానిగా పనిచేసిన చౌదరి దేవీలాల్ కుమారుడు. చౌతాలాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య స్నేహలత ఐదేళ్ల క్రితమే చనిపోయింది. 2000 లో 3206 జూనియర్ బేసిక్ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో చౌతాలా 2013లో దోషిగా తేలారు. ఆయన కుమారుడు అజయ్‌సింగ్ చౌతాలా, మరో 53 మంది ,ఐఎఎస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తదితరులకు పదేళ్లు శిక్ష పడింది. 2021లో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

కుటుంబ రాజకీయ చరిత్ర
చౌతాలా రెండో కుమారుడు అభయ్‌సింగ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు సీనియర్ నేతగా పనిచేశారు. పెద్ద కుమారుడు మాజీ ఎంపీ, అజయ్‌సింగ్ చౌతాలా జననాయక్ జనతా పార్టీకి సారథ్యం వహించారు. 2018 డిసెంబర్‌లో కుటుంబ విభేదాల వల్ల ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీలో చీలిక ఏర్పడడంతో జననాయక్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అభయ్ కుమారుడు అర్జున్ హర్యానా ఎమ్‌ఎల్‌ఎగా ఉండగా, అజయ్ చౌతాలా కుమారులు దుష్యంత్, దిగ్విజయ్ జననాయక్ జనతా పార్టీ నాయకులుగా ఉంటున్నారు. దుష్యంత్ చౌతాలా హర్యానా డిప్యూటీ సిఎంగా కూడా పనిచేశారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డి) బీజేపీ మిత్ర పక్షంగా కూడా వ్యవహరించింది. హర్యానాలో 2005 నుంచి ఐఎన్‌ఎల్‌డి అధికారాన్ని కోల్పోయింది.

ప్రధాని మోడీ, సిఎం నయాబ్ సింగ్ సైనీ సంతాపం
ప్రధాని నరేంద్రమోడీ, హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీ తదితరులు సంతాపం తెలిపారు. “ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంవత్సరాలు చురుకుగా వ్యవహరించిన చౌతాలా, దేవీలాల్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగారు” అని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో సంతాపం వ్యక్తం చేశారు. హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీ తన సంతాపంలో “ చౌతాలా తన జీవితాంతం రాష్ట్రప్రజలకు, సమాజానికి సేవలోనే గడిపారని, దేశ , రాష్ట్ర రాజకీయాలకు ఆయన లేని లోటు తీర్చలేనిది ” అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హూదా చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను హర్యానా అసెంబ్లీలో విపక్ష నాయకునిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆయన తనకు పెద్ద అన్నవంటివాడని, ఆయనతో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్‌సింగ్‌హూదా , కుమారి సేజా తమ సంతాపాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News