Sunday, November 17, 2024

బిజెపిలో చేరిన హర్యానా నేత అశోక్ తన్వర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజీనామా చేసిన అశోక్ తన్వర్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. దళిత నేత తన్వర్ చేరికతో హర్యానాలో తన బలాన్ని పెంచుకోవాలని అధికార పార్టీ బిజెపి చూస్తోంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, తదితర నాయకుల సమక్షంలో బిజెపిలో చేరిన తన్వర్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని శ్లాఘించారు. గడచిన పది సంవత్సరాలలో దేశం గణనీయ మార్పు చూసిందని తన్వర్ చెప్పారు. సోమవారం (22న) రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా బిజెపిలో చేరడం తన అదృష్టమని తన్వర్ విలేకరులతో అన్నారు.

తన్వర్‌ను బిజెపిలోకి ఖట్టర్ ఆహ్వానిస్తూ, ఆయనను తన ‘మేనల్లుడు’గా పేర్కొన్నారు. తాను, ఆయన తల్లి ఒకే గ్రామానికి చెందినవారమని ఖట్టర్ తెలిపారు. తన్వర్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన తరువాత బిజెపిలో చేరవలసి ఉందని, కాని ఆయన ‘రైలు’ తప్పుడు మార్గంలోకి వెళ్లి ఆప్‌ను చేరిందని ఖట్టార్ చమత్కారపూర్వకంగా వ్యాఖ్యానించారు. తన్వర్ 2019లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2022లో ఆప్‌లో చేరారు. ఆ మధ్యలో ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసి, కొద్ది కాలం తృణమూల్ కాంగ్రెస్‌లో కూడా చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే ఆలోచనలో ఉన్న ఆప్ నుంచి ఆయన గురువారం (18న) రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News