యుపి ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ప్రకటన
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తర్వలోనే తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులను, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు ఠాకూర్ విలేకరులకు తెలిపారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీకి అధికార్ సేన అనే పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని పేర్లతోపాటు పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, సిద్ధాంతాలు, స్వరూపాన్ని సూచించవలసిందిగా ఆయన తన మద్దతుదారులను కోరారు. ఈ ఏడాది మార్చి 23న ఠాకూర్‌ను పదవీ విరమణకు ముందుగానే రిటైర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని తన ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తన భర్త వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ ఈ నెల మొదట్లో ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన ఠాకూర్ 2028లో పదవీ విరమణ చేయవలసి ఉంది.