భారతదేశ అంతరిక్ష యాత్ర, పరిశోధనా రంగానికి పిడుగుపాటు పరిణామం చోటుచేసుకుంది. ఇస్రో మాజీ ఛైర్మన్ కె కస్తూరిరంగన్ తమ 84వ ఏట ఇక్కడ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయనకు శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు స్వలంగా గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి కోలుకోలేకపొయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా బహిరంగ వేదికలపైకి రాలేదు. ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడాతలెత్తడంతో ఇప్పుడు బెంగళూరులోని ఆయన స్వగృహంలో ఉదయం 10 గంటల 43 నిమిషాలకు గకన్నుమూశారు. 1994 నుంచి 2003 వరకూ ఆయన ఇస్రోకు సారధ్యం వహించారు. పలు కీలక మైలు రాళ్లు ఆయన హయాంలోనే ఇస్కో విజయవంతంగా దాటేసింది. పలు దిక్కుల నుంచి అంతర్జాతీయ నియంత్రణలు వెలువడుతూ వచ్చినా ఆయన వీటిని అధిగమించి సంస్థను ముందుకు సాగేలా చేశారు.
ప్రత్యేకించి ఆక్సోజెనిక్ సాంకేతిక పరిజ్ఞాన వినిమయం విషయంలో పలు దేశాల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. సవాళ్లను అధిగమిస్తూ ఇస్రో నిర్ణీత వ్యూహం ప్రకారం స్వయం సమృద్ధి దిశలో దూసుకువెళ్లింది. చంద్రయాన్ దిశలో ప్రయోగానికి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో తొలి అడుగులు పడ్డాయి. 1998లో భారతదేశ అణు పరీక్ష తరువాత అంతర్జాతీయ స్థాయిలో పలు ఆంక్షలు తలెత్తాయి. వీటిని దౌత్య రీతిలో ఎదుర్కొంటూ అంతరిక్ష ప్రయోగాలను ముందుకు సాగేలా చేయడంలో కస్తూరి ఎంతగానో పాటుపడ్డారు. ఆయన అంతరిక్ష సేవలను గుర్తించిన క్రమంలో ఆయనకు తరువాతి దశలో రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. పూర్వపు ప్రణాళిక సంఘం సభ్యులుగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కమిటీలలో కూడా ఆయన భాగస్వాములు అయ్యారు. డాక్టర్ కె కస్తూరిరంగన్ మరణం తనను కలిచివేసిందని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రియత, విద్యారంగంలో ఆయన ప్రముఖ దిగ్గజంగా వెలిగారని కొనియాడారు. దేశానికి ఆయన సేవలు ఎల్లవేళలా గుర్తుంటాయి.
ఐస్రోకు ఆయన అత్యంత హుందాగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. అంతవరకూ నేల చూపులు చూస్తూ వచ్చిన ఇస్రోను ఆయన పరుగులు తీయించారని ప్రధాని కితాబు ఇచ్చారు. ఆయన హయాంలోనే అత్యంత ప్రతిష్టాత్మక శాటిలైట్ ప్రయోగాలు జరిగాయి. అత్యంత సృజనాత్మకత , విశ్వసనీయతలతో ఇస్రో ప్రతిష్ట పెరిగిందని కొనియాడారు. కస్తూరి రంగన్ కన్నుమూత బాధాకరం అని , ఆయన దూరదృష్టి గల శాస్త్రజ్ఞులు. ఇస్రోకు మార్గదర్శకులు అయ్యారని కేంద్ర శాస్త్ర వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఆయననే అంతరిక్ష విభాగం పర్యవేక్షకులుగా కూడా ఉన్నారు. ఇస్రోకు ఆయన సేవలు భారతీయ శాస్త్రీయ రంగానికి తరతరాల పాటు గుర్తుంటాయని నివాళులుఅర్పించారు.