Sunday, November 24, 2024

జపాన్ మాజీ ప్రధాని హత్య

- Advertisement -
- Advertisement -

Former Japanese Prime Minister assassinated

కఠిన ఆయుధ నిషేధం అమల్లో గల జపాన్‌లో మాజీ ప్రధాని షింజో అబే హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అబే దీర్ఘకాలం జపాన్‌ను పాలించి 2020లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. 67 సంవత్సరాల అబే పార్లమెంటు యెన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా పట్టపగలు ఉదయం 11.30 గంటలకు జరిగిన కాల్పుల్లో నేలకొరిగిపోయారు. గురిపెట్టి మెడ మీద కాల్చడంతో గుండెకు తీవ్ర గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారని వార్తలు చెబుతున్నాయి. జపాన్‌ను సైనిక దేశంగా మారుస్తూ రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ప్రయత్నించి అబే విఫలమయ్యా రు. జపాన్ ఆంతరంగిక భద్రతను కాపాడే దళాలను మాత్రమే కలిగి ఉంది. బాహ్య శక్తులతో యుద్ధానికి తోడ్పడే సైన్యాన్ని వద్దనుకున్నది. అబే జపాన్‌ను బలమైన ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దాడన్న ఖ్యాతి గడించారు. ఆయన 2006 నుంచి 2007 వరకు, మళ్ళీ 2012 నుంచి 2020 వరకు ప్రధానిగా ఉన్నారు.సైన్యాన్ని యేర్పాటు చేసుకోవాలన్న ఆయన ప్రతిపాదనను లిబరల్ రాజకీయ వర్గాలు వ్యతిరేకించాయి. ఆర్ధిక రంగంలో ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు అబెనామిక్స్‌గా పేరొందాయి.

జపాన్ ఆర్ధిక మాంద్యంలో చిక్కుకొన్న దశలో ప్రవేశపెట్టిన యీ సంస్కరణలు దాని పునరుజ్జీవనానికి తోడ్పడ్డాయని చెప్పుకోవచ్చు. అవి విఫలమయ్యాయనేవారూ ఉన్నారు. కంపెనీలకు ఉత్పత్తి వ్యయానికి నిధుల లోటు లేకుండా, యిష్టమొచ్చిన వస్తువుల కొనుగోలు చేసుకోడానికి వినియోగదారులకు డబ్బుకు లోటు లేకుండా విరివిగా రుణాలు దొరికేలా చేశారు. కంపెనీలకు పన్ను విరామాలు కల్పించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టేలా చేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు విశేషంగా కల్పించి పని చేసేవారిలో వారి సంఖ్యను బాగా పెంచారు. వలస ఉద్యోగార్థుల నియామకాలనూ పెంచారు. అలా చేసి కార్మిక శక్తిని సమకూర్చుకోడంలో యెదురయిన యిబ్బందులను తొలగించారు. ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమలకు, కంపెనీలకు చవక ఉద్యోగులను సమకూర్చారు. ఇప్పటికీ జపాన్‌ను పాలిస్తున్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన అబే ఆర్ధిక వ్యవస్థను 600 ట్రిలియన్ల యెన్‌లకు తీసుకుపోవాలని లక్ష్యంగా చేసుకొన్నారు.

దానిని యింత వరకూ చేరుకోలేదు. అయితే జపాన్ ఆర్ధిక రంగం పుంజుకున్నది, కాని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంవత్సరాల్లో చోటు చేసుకొన్న ఆర్ధిక విప్లవం స్థాయికి అది చేరలేదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పోషించిన పాత్రను చరిత్రలో తగిన విధంగా నమోదు చేయలేదని అబే భావించేవారు. ఆయన విమర్శకులు దానిని అంగీకరించలేదు. యుద్ధంలో జపాన్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నమే అది అని వారు యెత్తి చూపారు. అబే అతి జాతీయతను సహజంగానే చైనా, ఉభయ కొరియాలు వ్యతిరేకించాయి. అబే ప్రధాని మోడీకి అత్యంత ఇష్టుడు. ఇద్దరూ గణనీయమైన మితవాదులే. భారత -జపాన్ సంబంధాలను అపూర్వ స్థాయిలో బలోపేతం చేయడంలో అబే పాత్ర అసాధారణమైనవని మోడీ కొనియాడారు. భారతదేశంలో వొక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అబేను ఘనంగా కొనియాడారు. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా తమ కూటమిని పెంపొందించడంలో తోడ్పడ్డాడని మెచ్చుకొన్నారు.

కాల్పులకు అబే కుప్పకూలిపోయిన చోటనే 41యేళ్ల అనుమానితుడిని అరెస్టు చేశారు. నాటు తుపాకీతో అతడు కాల్పులు జరిపినట్టు వెల్లడయ్యింది. ప్రధానిని గాని, మాజీ ప్రధానిని గాని యిలా హతమార్చిన సందర్భాలు జపాన్‌లో సుదీర్ఘ గతంలో లేవు. తుపాకులు అందుబాటులో లేనందున అమెరికాలో మాదిరి గన్ కల్చర్ లేదు. పన్నెండు కోట్ల జనాభా గల జపాన్‌లో గత యేడాది మొత్తంలో 10 తుపాకీ కాల్పులే జరిగాయి. ఒక రైల్వేస్టేషన్ బయట ట్రాఫిక్ ఐలాండ్‌లో నిలబడి యెన్నికల ప్రచారం చేస్తుండగా అబేను కాల్చి చంపేశారు.

ఈ ఘటన తర్వాత జపాన్‌లో ఆంతరంగిక భద్రతను మరింత పటిష్ఠం చేయవచ్చు. అబే ఆశించినట్టు సైన్యాన్ని సమకూర్చుకొనే వైపు జపాన్ అడుగులు వేస్తుందేమో చూడాలి. రెండో ప్రపంచ యుద్ధంలో వోటమి తర్వాత జపాన్ సైన్యాన్ని సమకూర్చుకోవద్దని, నిస్సైనికంగానే ఉండాలని తీర్మానించుకొని ఆ మేరకు రాజ్యాంగంలో గట్టి సంకల్పం చెప్పుకొన్నది.అమెరికాతో స్నేహం దాని భద్రతకు హామీగా ఉంటున్నది. చైనాకు వ్యతిరేకంగా యేర్పాటైన క్వాడ్‌లో జపాన్ చేరింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణం గానూ, తనకు దగ్గరగా గల తైవాన్‌పై చైనా దాడి చేసే అవకాశాలు పెరిగినందున సైన్యాన్ని సమాకుర్చుకోవాలని జపాన్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ అవకాశాలు లేకపోలేదని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించి వున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News