Monday, December 23, 2024

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Former Japanese Prime Minister Shinzo Abe was brutally murdered

ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.. మధ్యాహ్నం ఆయన పార్టీ ఎల్‌డిపి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన నరా నగరంలో డెమోక్రటిక్ లిబరల్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అబె ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. అత్యంత సమీపంనుంచి దేశీయ తుపాకితో రెండుసార్లు ఈ కాల్పులు జరగడంతో అబె ఛాతీలోకి తూటాలు దూసుకుపోయాయి. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆయనను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్ల్లారు. అప్పటికే ఆయన శ్వాసతీసుకోవడం లేదని, హృదయం కూడా స్పందించలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. దుండగుడు అబె వెనుకవైపు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు సమాచారం. జపాన్‌లో ఆదివారం పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచార నిమిత్తం అబె నరా నగరంలోని ఓ కూడలి వద్ద ప్రసంగిస్తుండగా కుప్పకూలారు. అదే సమయంలో తుపాకీ శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే ఓ అనుమానితుడ్ని అరెస్టు చేశారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా భావించే జపాన్‌లో తుపాకుల వినియోగంపై చాలాకాలంగా నిషేధం ఉంది.అలాంటి దేశంలో మాజీ ప్రధానిపైనే కాల్పులు జరగడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

దాదాపు ఐదు గంటలు చికిత్స

ఘటన అనంతరం అబెను నరా మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. బుల్లెట్ గాయాల కారణంగా అబె శరీరంలో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగినట్లు తెలిపాయి. అబెను రక్షించడానికి వైద్యులు తీవ్రంగా స్పందించారు. ఒక దశలో రక్తం ఎక్కించినట్లు ఆయన సోదరుడు చెప్పారు. దుండగుడు కాల్చిన రెండు తూటాల్లో ఒకటి ఆయన గుండెలోకి చొచ్చుకుపోయినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు అయిదు గంటల సేపు అబెకు చికిత్స అందించినా వైద్యుల శ్రమకు ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ప్రముఖ రాజకీయ కుటుంబం

2006లో తొలిసారి జపాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన అబె 2007 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2012లో రెండో సారి ప్రధాని అయిన ఆయన 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలంప్రధానిగా పని చేసిన వ్యక్తి ఆయనే. అయితే అనారోగ్యం కారణాలతో 2020లో అబె పదవినుంచి దిగిపోయారు. షింజె అబెది జపాన్‌లో పేరుగల రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి షింతారో అబె ఆ దేశ విదేశాంగమంత్రిగా పని చేశారు. ఇక అబె తాత దేశ ప్రధానిగా పని చేశారు. మాజీ ప్రధాని నొబుషికె కిషి మనుమడే అబె. రాజకీయంగా అబె కుటంబానికి ఘన చరిత్ర ఉంది. జపాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా షింజో కొనసాగారు. ప్రధానిగా ఉన్న సమయంలో షింజో తన ఆర్థిక విధానాలతో ఆకట్టుకున్నారు. ఆయన ఆర్థిక విధానాలకు జపాన్‌లో ‘అబెనామిక్స్’ అన్న పేరు వచ్చింది. షింజె అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. టోక్యోలోని సీకే యూనివర్సిటీలో పాలిటిక్స్ చదివారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనూ ఉన్నత విద్యనభ్యసించారు. కొంతకాలం కోబె స్ట్టీల్‌లో పని చేసిన తర్వాత విదేశాంగ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు.1993లో జపాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. అప్పుడు షింజే వయసు 38 ఏళ్లు మాత్రమే. ఎన్నో క్యాబినెట్ హోదాల్లో పని చేశారు. ఎల్‌డిపి పార్టీకి 2003లో సెక్రటరీ జనరల్ అయ్యారు.ఆ తర్వాత నాలుగేళ్లకు పార్టీ అధ్యక్షుడయ్యారు. తర్వాత ప్రధాని పదవి చేపట్టారు.

చంపాలనే కాల్పులు జరిపా
పోలీసుల దర్యాప్తులో అంగీకరించిన దుండగుడు
నిందితుడు యమగుచిగా గుర్తించిన పోలీసులు
మూడేళ్లు సైన్యంలో పని చేసిన దుండగుడు

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబెపై కాల్పులు జరిపిన దుండగుడిని 41 ఏళ్ల యమగామి టెట్సుయోగా పోలీసులు గుర్తించారు. కాగా షింజోను చంపాలనే ఉద్దేశంతోనే ఆయనపై కాల్పులు జరిపినట్లు నిందితుడు పోలీసుల దర్యాప్తులో అంగీకరించినట్లు తెలుస్తోంది. అబెపై తాను అసంతృప్తితో ఉన్నానని, అందుకే హత్య చేశానని చెప్పడం గమనార్హం. అయితే కాల్పుల కోసం దుండగుడు చాలా సమయంనుంచి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అబె ప్రసంగిస్తుండగా ఆయనకు కొద్ది దూరంలోనే నిందితుడు నిల్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడు యమగామి నివాసంలో తనిఖీలు జరిపారు. అతడి గదితో పోలీసులు పేలుడు పదార్థాలను గుర్తించినట్లు జపాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాక అబెపై కాల్పుల కోసం వాడిన తుపాకీని అతడే స్వయంగా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దుండగుడు మూడేళ్ల పాటు జపాన్ మారిటైమ్ సెల్ డిఫెన్స్ ఫోర్స్‌లో పని చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News